లోక్​సభ అభ్యర్థులపై కాంగ్రెస్ స్పీడప్.. 10 మందితో ప్రపోజల్ లిస్ట్

లోక్​సభ అభ్యర్థులపై కాంగ్రెస్ స్పీడప్..   10 మందితో ప్రపోజల్ లిస్ట్
  • సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిన స్టేట్ కాంగ్రెస్  
  • మరో 7 స్థానాలపై కుదరని ఏకాభిప్రాయం
  • బీసీలకు మూడు సీట్లు ఇవ్వాలని నిర్ణయం 
  • సీఎం రేవంత్ ఇంట్లో స్ర్కీనింగ్​ కమిటీ భేటీ

హైదరాబాద్, వెలుగు:  లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును కాంగ్రెస్ స్పీడప్ చేసింది. శుక్రవారం రాత్రి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంట్లో స్ర్కీనింగ్​ కమిటీ భేటీ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా.. ఆశావహుల నుంచి 309 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో స్థానం నుంచి ముగ్గురు, నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన కమిటీ.. 10 సీట్లకు ఒక్కొక్క పేరుతో ప్రపోజల్ లిస్టు రెడీ చేసింది. ఆ జాబితాను సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించింది.

‘‘10 సీట్లలో ఏకాభిప్రాయం కుదిరింది. ఆ సీట్లకు ఒక్కొక్క పేరుతో ప్రపోజల్ లిస్టు రెడీ చేసి, దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాం. ఆ లిస్టుకు కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అవసరమైతే అందులో మార్పులు, చేర్పులు కూడా ఉండొచ్చు’’ అని పీసీసీ నేత ఒకరు  చెప్పారు.  సమావేశంలో కమిటీ చైర్మన్ హరీశ్ చౌధురి, సభ్యులు జిగ్నేశ్ మేవానీ, విశ్వజిత్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ రాష్ట్ర కార్యదర్శులు రోహిత్ చౌధురి, మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం నుంచి రాహుల్ పోటీపై చర్చ..   

మరో ఏడు సీట్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో వాటిపై ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఈ సీట్లను ఇటీవల పార్టీలో చేరిన వారికి, అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మాట ఇచ్చిన నేతలకు సర్దుబాటు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖమ్మం నుంచి పోటీ చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కోరాలని పీఈసీ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. లేదంటే నల్గొండ, భువనగిరి స్థానాలను పరిశీలించాలని కొందరు నేతలు కోరినట్టు సమాచారం. జహీరాబాద్, మెదక్, సికింద్రాబాద్ స్థానాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే బీసీలు నాలుగు సీట్లు కేటాయించాలని కోరుతుండగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  

7 సీట్లలో ఎంపిక బాధ్యత హైకమాండ్​కే..  

ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేయని పక్షంలో తమకే టికెట్ కేటాయించాలని ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కొడుకు యుగేంధర్ టికెట్ ఆశిస్తున్నారు.  ఆదిలాబాద్ నుంచి ఆదివాసీలు, లంబాడీలలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందనే దానిపై చర్చ సాగుతోంది. మెదక్ సీటుకు నీలం మధు ముదిరాజ్ పేరు ప్రచారంలో ఉంది. హైదరాబాద్ కు ఫిరోజ్ ఖాన్ పేరు ప్రచారంలో ఉండగా, సమీరుల్లా అనే మరో నేత కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వరంగల్ నుంచి అద్దంకి దయాకర్, సర్వే సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. మల్కాజ్​గిరి బరిలో మైనంపల్లి హన్మంతరావు, విజయశాంతి, బండ్ల గణేశ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడు సీట్లలో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను పూర్తిగా హైకమాండ్ కే వదిలేయనున్నట్టు సమాచారం. 

6 నుంచి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 6న పాలమూరు వేదికగా ప్రజా దీవెన పేరుతో  పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభకు రావాల్సిందిగా శనివారం సీఎం రేవంత్ ను ఆ జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎంను కలిసిన వారిలో ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నం శ్రీనివాస రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, అనిరుధ్ రెడ్డి ఉన్నారు. 6న సాయంత్రం 4 గంటలకు మహబూబ్ నగర్ టౌన్ లోని  ఎంవీఎస్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. ఈ సభా వేదిక నుంచి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ మరిన్ని వరాలు  ప్రకటించనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.