అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ ‘స్ట్రాటజీ మీటింగ్’

అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ ‘స్ట్రాటజీ మీటింగ్’
  • ఒకరిపై ఒకరు విమర్శలు మానుకోవాలని సూచన
  • ఎన్నికల వ్యూహాలపై చర్చించామన్న పీసీసీ చీఫ్​ రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా సమష్టిగా ముందుకెళ్లాలని, పరస్పర విమర్శలు మానుకోవాలని ముఖ్యనేతలకు రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో, ఏం చేస్తున్నారో తనకు తెలుసన్నారు. విభేదాలు ఉంటే పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తో లేదా తనతో నేరుగా మాట్లాడాలని సూచించారు. అంతేతప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయట మాట్లాడవద్దని హెచ్చరించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరిగింది. మీటింగ్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్య నేతలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, సీతక్క, వీహెచ్, దామోదర రాజనర్సింహ, మధు యాష్కి, షబ్బీర్ అలీ, జగ్గా రెడ్డి, సంపత్, రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12కు ప్రారంభమైన ఈ భేటీ దాదాపు 3 గంటలు సాగింది. సొంత పార్టీ నేతలే తమపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా పలువురు నేతలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై రాహుల్ స్పందిస్తూ తెలంగాణలో పరిస్థితులపై తమకు స్పష్టత ఉందని చెప్పినట్లు తెలిసింది. పార్టీ కోసం పనిచేసే వారిని వదులుకోమని, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే సహించబోమని హెచ్చరించినట్లు సమాచారం.    

ప్రజాధనం కేసీఆర్ లూటీ: ఠాక్రే  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం పక్కదారి పట్టిందని కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తికావస్తోన్నా.. ప్రజలు కోరుకున్న తెలంగాణ నిర్మాణం కాలేదన్నారు. కేసీఆర్ ప్రజా ధనం లూటీ చేస్తున్నారని ఆరోపించారు.  స్ట్రాటజీ మీటింగ్ లో వైఎస్సార్ టీపీ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు.  

బీఆర్​ఎస్​తో పొత్తే ఉండదు: మధుయాష్కీ

రాష్ట్రంలో కుటుంబ పాలన కావాలంటే బీఆర్ఎస్ కు, ప్రజా పాలనా కావాలంటే కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలన్న నినాదంతో ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్​తో పొత్తు ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసిందన్నారు. అయితే, కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో అనవసరంగా బీఆర్ఎస్ తో జతకట్టారని విమర్శించారు. ఎన్నికలకు శంఖారావం పూరించామని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. . పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఎన్నికల కార్యాచరణ షురూ

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కార్యాచరణ మొదలైందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో స్ట్రాటజీ మీటింగ్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు 120 రోజుల వ్యూహాలపై మీటింగ్ లో చర్చించా మన్నారు. కలిసికట్టుగా పోరాటం, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్ర అధికార దుర్వినియోగంపై చర్చ జరిగిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మ్యానిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీట్లలో ప్రాధాన్యత అంశాలు కూడా చర్చకు వచ్చాయన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పాటించిన ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు.