హామీల అమలుపై కాంగ్రెస్​ది దాటవేత ధోరణి : మాజీ మంత్రి హరీశ్​ రావు

హామీల అమలుపై కాంగ్రెస్​ది దాటవేత ధోరణి : మాజీ మంత్రి హరీశ్​ రావు
  • లోక్ సభ ఎన్నికల కోడ్ రాక ముందే హామీలు అమలు చేయాలని డిమాండ్

సిద్దిపేట, వెలుగు : ఆరు గ్యారంటీల్లోని 13 అంశాల అమలుపై కాంగ్రెస్  ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తోందని మాజీ మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ఎన్నికల కోడ్  రాక ముందే అన్ని హామీలను అమలు చేసి మాట నిలుపుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట కొండ మల్లయ్య గార్డెన్ లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్  నేతలు అసహనంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. హామీల గురించి ప్రజల పక్షాన నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. ‘‘డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా వేస్తామని ఇప్పటికీ పూర్తి చేయలేదు.

నిరుద్యోగ భృతిపై యూత్  డిక్లరేషన్ లో స్పష్టంగా నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తామని కాంగ్రెస్  హామీ  ఇవ్వడమే కాకుండా ప్రియాంక గాంధీ సైతం ఇదే విషయాన్ని సభల్లో చెప్పారు. కానీ, అలాంటీ హామీ ఇవ్వలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దబాయించడం శోచనీయం. గృహజ్యోతి ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియదు” అని హరీశ్  పేర్కొన్నారు. కరెంటు బిల్లులు ఎవరికి పంపాలా అన్న విషయంపై గ్రామాల్లో చర్చలు జరపాలని చేయాలని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్  నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  ప్రభుత్వ హయాంలో 24 గంటలు కరెంటు సరఫరా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కరెంటు కోతలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. రోజుకు 14 గంటల కన్నా ఎక్కువ సేపు కరెంటు సరఫరా కావడం లేదని ఎద్దేవా చేశారు.