
- కోర్టు కేసులతో అప్పులై ఆత్మహత్యలు చేస్కుంటున్నరు
- వ్యవసాయ రంగంలో బీఆర్ఎస్ సర్కారువైఫల్యాలపై కాంగ్రెస్ మూడో చార్జ్‌షీట్
హైదరాబాద్, వెలుగు: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్టుగా ‘ధరణి’ పోర్టల్ తయారైందని కాంగ్రెస్ మండిపడింది. భూ రికార్డులను ప్రక్షాళన చేస్తానన్న కేసీఆర్ మాట నెరవేరకపోగా.. భూముల రికార్డులు తారుమారయ్యాయని విమర్శించింది. సాదాబైనామాలూ రికార్డుల్లోకి ఎక్కకపోవడం రైతులకు శాపంగా మారిందని ఆదివారం విడుదల చేసిన మూడో చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. వ్యవసాయ రంగంలో బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను చార్జ్‌షీట్‌లో ఎండగట్టింది. ధరణి పోర్టల్‌తో రాష్టవ్యాప్తంగా 22 లక్షల మంది రైతులు బాధితులుగా మారారని, దానివల్ల రెండేండ్లలో లక్షలాది కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఆ కోర్టు కేసుల వల్లే చాలా మంది రైతులు అప్పులపాలవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇక్కడే ‘పంటల బీమా’ అమలు చేయట్లే
ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే అంచనా వేసి పరిహారం చెల్లించాల్సిన రాష్ట్ర సర్కారు.. 2020 నుంచి పంటల బీమా పథకాన్ని ఆపేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘‘2020కి సంబంధించిన పంట నష్టాలకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సర్కారు పరిహారం చెల్లించలేదు. 2021లో 20 లక్షల ఎకరాలు, 2022లో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయినా ఒక్క పైసా సర్కారు ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలూ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నా.. ఒక్క కేసీఆర్ సర్కారే ఆ పథకాన్ని అమలు చేయట్లేదు’’ అని పేర్కొంది.
కౌలు రైతులకు రైతుబంధు ఏది?: మహేశ్వర్ రెడ్డి
దేశంలో రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యల గురించి హేళనగా మాట్లాడిన మంత్రి నిరంజన్‌రెడ్డికి ఆ స్థానంలో కూర్చునే అర్హత లేదని ఫైర్ అయ్యారు. ఆదివారం బీఆర్ఎస్పై చార్జ్‌షీట్ విడుదల చేశాక మీడియాతో ఆయన మాట్లాడారు. కౌలు రైతులకు రైతుబంధు ఎందుకివ్వట్లేదని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలు అంటగడుతున్న వారిపై, కంపెనీలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు రాములు నాయక్, ప్రధాన కార్యదర్శి కైలాష్, పాల్వాయి స్రవంతి, భరత్ చౌహాన్ పాల్గొన్నారు.
కేంద్రపాలనపై కూడా రిలీజ్ చేస్తాం: మాణిక్ రావు
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలు, ప్రజావ్యతిరేక పనులపై చార్జ్‌షీట్ విడుదల చేస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. అలాగే ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వ పాలనపైనా విడుదల చేస్తామని ఆయన చెప్పారు. రేవంత్ సోమవారం నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర మొదలుపెడతారని ఆదివారం గాంధీభవన్‌లో మీడియాకు ఆయన వెల్లడించారు. ఆయన ఆ యాత్రలో ఉన్నందున పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనరన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న నేతలు వీలుచూసుకుని తమ తమ నియోజకవర్గాల్లో యాత్ర చేస్తారన్నారు. అవకాశం ఉంటే వేరే ప్రాంతాల్లోనూ యాత్ర చేయవచ్చన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాలను జనాల్లోకి తీసుకెళ్తామన్నారు.
ఆరేండ్లలో 6,121 రైతు ఆత్మహత్యలు
‘‘రుణ మాఫీ చేసిన కొద్దిమందికీ పూర్తి స్థాయిలో చేయలేదు. దీంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోగా.. రైతుబంధు సొమ్మును వడ్డీ కింద జమ కట్టుకుంటున్నాయి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ రైతులను హెచ్చరించారు. దీంతో చాలామంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2014 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 6,121 మంది ఆత్మహత్య చేసుకున్నారు” అని వివరించింది. రాష్ట్రాన్ని సీడ్‌బౌల్‌గా మారుస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన అమలుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదు. రైతుబంధు భూస్వాములకే వస్తున్నదని, చిన్నసన్నకారు రైతులకు అందడం లేదని కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయింది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ను ఇస్తున్నామని సర్కారు చెప్తున్నా.. ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని పేర్కొంది. అధికారంలోకి వచ్చి ఎనిమిదన్నర ఏండ్లు అవుతున్నా విద్యుత్ పంప్సెట్ల సర్ చార్జీలను రద్దు చేయలేదని మండిపడింది. ఏటా ఒక్కో రైతు నుంచి సర్‌చార్జీల రూపంలో సర్కారు రూ.720 వసూలు చేస్తోందని తెలిపింది.