మేళ్లచెరువు(చింతలపాలెం), వెలుగు: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం తమ్మవరంలో శుక్రవారం రెండు వర్గాల యువకులు దాడి చేసుకున్నారు.ఈ ఘటనలో ఓ యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని నాయకులు కొన్నేళ్లుగా రాజకీయంగా రెండు వర్గాలుగా విడిపోయారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన హనుమయ్య వర్గీయులు, ఓడిపోయిన సేనారెడ్డి వర్గీయుల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఎన్నికల్లో తమకు సహకరించలేదని పరస్పరం దూషించుకోవడం మొదలుపెట్టారు.
పలుమార్లు ఒకరిపై మరొకరు దాడులకు యత్నించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీ వద్ద రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగింది.శుక్రవారం శ్రీకాంత్ రెడ్డి, మహేశ్ గౌడ్ ఊరి సెంటర్ లో ఉండగా, కొందరు యువకులు కత్తి, బండరాయిలతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీకాంత్ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. మహేశ్ రెడ్డి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, శ్రీకాంత్ రెడ్డిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ రెడ్డి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
