కాంగ్రెస్ టికెట్లు.. వలస వచ్చినోళ్లకేనా!?

కాంగ్రెస్ టికెట్లు..  వలస వచ్చినోళ్లకేనా!?

హైదరాబాద్‌‌, వెలుగు: పదేండ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనుకుంటున్నది. దానికోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. అయితే, కష్టకాలంలో పార్టీ కోసం చెమటోడ్చిన నేతలను కాదని పారాచూట్ లీడర్లను ప్రోత్సహిస్తుందనే విమర్శలు ఎదుర్కొంటున్నది. తెలంగాణ ఇచ్చి కూడా రాష్ట్రంలో అధికారానికి దూరమైన కాంగ్రెస్.. తాజా రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. 

రాబోయే ఎన్నికల్లో గెలవగలిగే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నది. ఈ క్రమంలో రాజకీయంగా, ఆర్థికంగా బలంగా ఉన్న నేతల వేటలో పడింది. తన టీమ్​తో 119 నియోజకవర్గాల్లో పేరున్న, బలమైన, గెలవగలిగే నేతల కోసం సర్వేలు కూడా చేయించింది. ఇన్నేండ్లు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను.. వలసొచ్చిన వాళ్ల కారణంగా పక్కనపెడ్తున్నారనే ఆందోళనలో లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు. పార్టీ కార్యక్రమాల కోసం ఆస్తులు అమ్మిన తమను, అధిష్టానం పట్టించుకోవడంలేదనే విమర్శలు కాంగ్రెస్​పై ఉన్నాయి. 

ఎవరితో అయితే పోరాడామో.. వాళ్లనే పార్టీలో చేర్చుకోవడాన్ని లీడర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ బలోపేతానికి అడ్డం పడిన నేతలకే టికెటిస్తే తమ పరిస్థితేంటనే ఆలోచనలో కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి లీడర్లే ఇలా చేస్తుండటం పార్టీకి ప్రమాదకరమని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లను చేర్చుకుని టికెట్లు కేటాయించడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు.