ఇయ్యాల్నే కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఎన్నికలు

ఇయ్యాల్నే కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ ఎన్నికలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్​ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 65 పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ జరగనుంది. పార్టీలోని 9 వేల మంది ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ(పీసీసీ) డెలిగేట్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 137 ఏండ్ల పార్టీ చరిత్రలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్​ జరగడం ఇది ఆరోసారి. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ బరిలో లేకపోవడం వల్ల 24 ఏండ్ల తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ చీఫ్ పదవికి సీనియర్​ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీపడుతున్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల పీసీసీ కార్యాలయాల్లో, ఏఐసీసీ కార్యాలయంలో, భారత్ జోడో యాత్ర క్యాంప్ లో కూడా పోలింగ్ కోసం ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్​ గాంధీ అక్కడే ఓటేస్తారని  సమాచారం. సోమవారం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని పార్టీ ఎన్నికల అథారిటీ చైర్మన్ మిస్త్రి తెలిపారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటేస్తారని పార్టీ నేతలు తెలిపారు. పోలింగ్​ పూర్తయ్యాక బ్యాలెట్​ బాక్సులకు సీల్ వేసి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్​క్వార్టర్స్​కు తరలిస్తారు. ఈ నెల 19న కౌంటింగ్​ చేపట్టి, ఫలితాలు ప్రకటిస్తారు.