
- మూడు జిల్లాల నుంచి జన సమీకరణ
- ఏర్పాట్లు పరిశీలించిన పీసీసీ చీఫ్ , మంత్రులు
కామారెడ్డి, వెలుగు: బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. భారీ సభ నిర్వహించడం బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ నాయకత్వం సన్నాహాలు చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి లో నిర్వహించిన సభలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్‌లో హామీ ఇచ్చింది. దేశంలోనే ఎక్కడాలేని విధంగా బీసీ జన గణన చేసిన ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లులను అమోదించి గవర్నర్‌కు పంపారు. ఈ బిల్లులు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ముస్లింల సాకుతో బీజేపీకి చెందిన లీడర్లు బీసీ బిల్లలును వ్యతిరేకిస్తుండడంపై కాంగ్రెస్ ఇప్పటికే పోరాటాన్ని కొనసాగిస్తోంది. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బిల్లులకు చట్టబద్దత సాధించేందుకు పోరాటాన్ని ముమ్మరం చేయాలని పీసీసీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 15న భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించినందున సభ కూడా ఇక్కడే పెట్టాలని డిసైడ్ అయ్యింది.
భారీగా జన సమీకరణ
కామారెడ్డి సభకు కనీసం 2 లక్షల మందిని సమీకరించాలని పార్టీ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్లా జిల్లాల నుంచి ప్రధానంగా జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఈ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో పీసీసీ లీడర్లు జనాలను తరలించే విషయంలో చర్చిస్తున్నారు. కామారెడ్డికి దగ్గరగా ఉండే మండలాలపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానుండడంతో గ్రామ, మండలస్థాయి లీడర్లు కూడా ఉత్సాహం పనిచేసే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు హాజరు కావచ్చునని తెలుస్తోంది.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు. సభ నిర్వహణ, జన సమీకరణ తదితర అంశాలను పరిశీలించేందుకు ఆదివారం కామారెడ్డిలో సన్నాహాక సమావేశం జరిగింది. సభ సక్సెస్చేసేందుకు ఎలా పని చేయాలో పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్, మంత్రులు దిశానిర్దేశం చేశారు. మీటింగ్‌లో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ షేట్కార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, మదన్మోహన్రావు, భూపతిరెడ్డి, తోట లక్ష్మీకాంతరావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.