కాంగ్రెస్‌కు కొత్త బాస్?.. వీకెండ్‌లో సీడబ్ల్యూసీ భేటీ

కాంగ్రెస్‌కు కొత్త బాస్?.. వీకెండ్‌లో సీడబ్ల్యూసీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి త్వరలో కొత్త చీఫ్​ రాబోతున్నారా? ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీనే మళ్లీ కొనసాగబోతున్నారా? ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్‌లో అత్యున్నత విభాగమైన సెంట్రల్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కాబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించబోతున్నామని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల పంజాబ్ కాంగ్రెస్‌ సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే త్వరలో సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండబోతోందని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎలక్టెడ్ ప్రెసిడెంట్ లేరని, మరి పార్టీలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారో అంటూ కపిల్ సిబాల్‌ కామెంట్స్ చేశారు. జీ23 పేరుతో పాపులర్ అయిన సీనియర్ నేతల టీమ్ జీ హుజూర్‌‌ సంస్కృతిని పాటించబోదని, పార్టీలో ఉన్న సమస్యలపై గొంతు విప్పుతుందని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో పార్టీలో యువనేతలు కొందరు.. ‘గెట్ వెల్ సూన్‌’ అంటూప్లకార్డులు పట్టుకుని  కపిల్ సిబల్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ తీరును జీ23 గ్రూప్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ భేటీ తేదీని ప్రకటించడం, అందులో పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించబోతున్నట్లు స్పష్టం చేయడంతో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉందన్న వార్తలు ఢిల్లీ కాంగ్రెస్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మరోవైపు వచ్చే ఏడాదిలో యూపీ, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోల్ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్ కిశోర్‌‌  కాగ్రెస్ పార్టీలో చేరుతారన్న వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలా లోతైన సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక్కసారిగా పరిష్కరించడం సాధ్యం కాదంటూ ట్వీట్ చేయడం కూడా ప్రాముఖ్యం సంతరించుకుంది. ఒక్కొక్కటిగా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తల కోసం..

హైదరాబాద్‎లో మళ్లీ మొదలైన భారీ వర్షం

దేశంలో చీకట్లు  కమ్ముకునే ముప్పు:కరెంట్ ఉత్పత్తి నిలిచిపోద్దా?

హైదరాబాద్‌లో భారీ వర్షానికి రెస్టారెంట్‌లోకి వరద