
దేశానికి విద్యుత్ సంక్షోభం ముప్పు ముంచుకొస్తోంది. బొగ్గు ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసే థర్మల్ పవర్ ప్లాంట్లను ఆ బొగ్గు కొరత వెంటాడుతోంది. చాలా విద్యుత్ కేంద్రాల్లో బఫర్ స్టోరేజీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. ఒక్కటి రెండ్రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బొగ్గు ఉత్పత్తి, సరఫరాలోనూ సమస్యలు ఉన్న నేపథ్యంలో దేశంలో ఈ థర్మల్ ఉత్పత్తి మీద ఆధారపడిన ప్రాంతాలన్నీ చీకట్లు అలుముకునే ముప్పు కనిపిస్తోంది. బొగ్గు నిల్వలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నా.. సాధ్యపడడం లేదని జాతీయ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ చెప్పారు. గడిచిన కొన్నాళ్లుగా పవర్ ప్లాంట్స్‌లో బొగ్గు బఫర్ స్టాక్‌ను ఐదారు నెలలకు సరిపడా పెంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ, మూడ్రోజులకు మించి స్టాక్ పెట్టలేకపోతున్నామని అన్నారు.
కేంద్రానికి ముఖ్యమంత్రుల లేఖలు
కేంద్ర విద్యుత్ చెబుతున్న లెక్కల ప్రకారమే దేశంలో ఉన్న 135 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 108 చోట్ల బొగ్గు కొరత తీవ్రంగా ఉంది. వాటి 28 చోట్ల ఒక్క రోజుకు సరిపడా బొగ్గు మాత్రమే ఉంది, వెంటనే బొగ్గు సప్లై చేయలేకపోతే కరెంట్ ఉత్పత్తి నిలిచిపోతుంది. గత వారం చివరి నుంచి అనేక చోట్ల ఇటువంటి గడ్డు పరిస్థితుల్లోనే పవర్ ప్లాంట్లు నడుపుకొస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ పవర్ క్రైసిస్‌పై ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇవాళ బొగ్గు కొరత గురించి పూర్తి వివరాలతో ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఢిల్లీ విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని, దీనిపై తాను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గు నిల్వలు, గ్యాస్ సరఫరా అందిచాలని ప్రధాని మోడీని కోరారు. విద్యుత్ కొరత ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఓపెన్ మార్కెట్‌లో యూనిట్ ధర రూ.20 చొప్పున పెట్టి కొనాల్సి వస్తోందని, దీనిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని తన లేఖలో పేర్కొన్నారు.
Delhi could face a power crisis. I am personally keeping a close watch over the situation. We are trying our best to avoid it. In the meanwhile, I wrote a letter to Hon’ble PM seeking his personal intervention. pic.twitter.com/v6Xm5aCUbm
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 9, 2021