కాంగ్రెస్ గెలుపు అసాధ్యం : లక్ష్మణ్‌‌

కాంగ్రెస్ గెలుపు అసాధ్యం : లక్ష్మణ్‌‌
  • ఆ పార్టీ పాలనలో అవినీతి, కుంభకోణాలే: లక్ష్మణ్‌‌

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెల్వడం అసాధ్యమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఏనాడూ 60 సీట్లు గెల్చుకోలేదని, అలాంటిది ఇప్పుడు 60 సీట్లు ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. మంగళవారం సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన సీట్ల వివరాలను విడుదల చేశారు. 1983 నుంచి జరిగిన ఉమ్మడి రాష్ట్రంలోని ఎన్నికలను గమనిస్తే.. కాంగ్రెస్ ఎప్పుడైనా రాయలసీమ, ఆంధ్ర ప్రాంత సీట్లతోనే అధికారంలోకి వచ్చింది తప్ప.. తెలంగాణలో వచ్చిన సీట్లతో కాదన్నారు.

తెలంగాణ నుంచి 1989లో మాత్రమే కాంగ్రెస్‌‌కు 58 సీట్లు వచ్చాయని, 2004లో 54 సీట్లు గెలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలన గురించి రాష్ట్ర ప్రజలకు ఓ ఐడియా ఉందని, ఆకాశం, భూమి, సముద్రం అన్నింటిలోనూ అవినీతి, కుంభకోణాలే అని మండిపడ్డారు. ‘బై బై బీఆర్‌‌‌‌ఎస్.. వెల్‌‌కమ్ బీజేపీ’అని ప్రజలు అంటున్నారని, కాంగ్రెస్‌‌కు మొండిచేయి, కారు షెడ్‌‌కు పోవడం ఖాయమన్నారు. గత మూడ్రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మోదీ, అమిత్ షా, నడ్డా ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. ప్రధాని రోడ్ షోకు, సభలకు విశేష ఆదరణ లభించిందన్నారు. బీసీలు, ఎస్సీలు, మహిళలు బీజేపీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మోదీ మూడ్రోజుల పర్యటన పార్టీ విజయానికి ఎంతో దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.