మధ్యప్రదేశ్‌‌లో టఫ్‌‌ ఫైట్! బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

మధ్యప్రదేశ్‌‌లో  టఫ్‌‌ ఫైట్! బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
  • ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ ఫలితాలు కొన్ని బీజేపీ వైపు.. ఇంకొన్ని కాంగ్రెస్‌‌ వైపు
  • రెండు పార్టీలు చెరో వంద సీట్లకు పైగా సాధించవచ్చని సర్వే రిపోర్టులు
  • బీజేపీ, కాంగ్రెస్.. చెరో వంద సీట్లకు పైగా సాధించొచ్చన్న  ఎగ్జిట్‌‌ పోల్స్‌‌

భోపాల్:  మధ్యప్రదేశ్‌‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని వెల్లడించాయి. రెండు పార్టీలు చెరో వంద సీట్లకు పైగా సాధించవచ్చని చెప్పాయి. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 116 కాగా.. ఎగ్జిట్‌‌ పోల్స్‌‌ అంచనాల ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మెజారిటీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్‌‌కు ఎక్కువ సీట్లు వస్తాయని కొన్ని సంస్థలు.. బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఇంకొన్ని సంస్థలు అంచనా వేశాయి. 

బీజేపీకి మెజారిటీ వస్తుందని చాణక్య, రిపబ్లిక్ – మాట్రిజ్, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా, ఇండియా టీవీ సీఎన్‌‌ఎక్స్ సంస్థలు.. కాంగ్రెస్‌‌దే పవర్ అని పీపుల్స్ పల్స్, టైమ్స్‌‌ నౌ, టీవీ9 భరతవర్ష్ పోల్‌‌స్ట్రాట్, దైనిక్ భాస్కర్ తమ రిపోర్టులో పేర్కొన్నాయి. బీజేపీకి 139--‌–163 దాకా సీట్లు రావచ్చని చాణక్య, 140–-162 సీట్లు రావచ్చని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా, 140-–159 రావచ్చని ఇండియా టీవీ సీఎన్‌‌ఎక్స్ సంస్థలు అంచనా వేయడం గమనార్హం. జన్‌‌కీ బాత్ మాత్రం.. రెండింట్లో ఏదో ఒక పార్టీ స్వల్ప మెజారిటీ సాధించవచ్చని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 3న మధ్యప్రదేశ్‌‌లో ఎలాంటి ఫలితాలు  రానున్నాయనేది ఆసక్తికరంగా మారింది.

2018లో ఇలా..

గత ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లలో గెలిచింది. బీజేపీ 109 చోట్ల విజయం సాధించింది. బీఎస్పీకి రెండు సీట్లు, ఎస్పీకి ఒక సీటు వచ్చాయి. నలుగురు స్వతంత్రులు గెలిచారు. బీఎస్పీ, ఎస్పీ, స్వతంత్రుల సపోర్టుతో కమల్‌‌నాథ్‌‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో 15 నెలల్లోనే కాంగ్రెస్‌‌ అధికారాన్ని కోల్పోయింది. తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో బీజేపీ పవర్ చేపట్టింది.2005 నుంచి శివరాజ్‌‌ చౌహాన్ మధ్యప్రదేశ్‌‌లో 2005 నుంచి సీఎంగా శివరాజ్‌‌ సింగ్ చౌహాన్ కొనసాగుతున్నారు. 2018 – 2020 మధ్య ఓ 15 నెలలు మాత్రమే కమల్‌‌నాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. ఇప్పుడు ఐదో సారి సీఎం కావాలని శివరాజ్ పోటీ పడుతున్నారు. అయితే సీఎం క్యాండిడేట్‌‌గా ఆయన పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించలేదు. క్యాండిడేట్ల జాబితాల్లోనూ ఆలస్యంగానే ఆయన పేరు ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్‌‌గా కమల్‌‌నాథ్ ఉన్నారు.