పాలమూరులో కాంగ్రెస్ ​వర్సెస్ ​బీజేపీ..నియోజకవర్గంపై సీఎం స్పెషల్​ ఫోకస్​

పాలమూరులో కాంగ్రెస్ ​వర్సెస్ ​బీజేపీ..నియోజకవర్గంపై సీఎం స్పెషల్​ ఫోకస్​
  • నియోజకవర్గంపై సీఎం స్పెషల్​ ఫోకస్​
  • ‘కొడంగల్’  స్కీమ్​, ముదిరాజ్​ల రిజర్వేషన్​ హామీలు కలిసి వస్తాయని కాంగ్రెస్​ ధీమా
  • మోదీ ఛరిష్మా, సెంట్రల్​ స్కీములను నమ్ముకున్న బీజేపీ
  • బీఆర్ఎస్​ అభ్యర్థి మన్నె యాక్టివ్​ అయినా మించిపోయిన గడువు
  • గులాబీ ఓట్లు ఎవరికి కలిసి వస్తాయనే లెక్కలు

మహబూబ్​నగర్,వెలుగు:మహబూబ్​నగర్​ లోక్​సభ స్థానంలో రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్​, బీజేపీల మధ్యే ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపును ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు ఇక్కడ విజయం సాధించి సీఎంకు చెక్​ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్​ క్యాండిడేట్, సిట్టింగ్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​ రెడ్డి ప్రచారాన్ని ప్రారంభించినా, ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ పార్టీ ఓట్లు చీలుతాయనే టాక్​ నడుస్తోంది. ఓట్లు చీలితే ఎవరికి కలిసొస్తాయోనని  పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి .

సీఎం రేవంత్​రెడ్డి  ప్రత్యేక దృష్టి

ఈసారి మహబూబ్​నగర్ ​నుంచి సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానిడుతు చల్లా వంశీచంద్​ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్​ కార్యక్రమానికి కూడా హాజరైన సీఎం ఈ స్థానం తమకెంతో ముఖ్యమైనదని చెప్పకనే చెప్పారు. వంశీని లక్ష మెజార్టీతో గెలిపించడం కోసం ఆయన ఎప్పటికప్పుడు కేడర్​కు సలహాలు, సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 21, మార్చి 6, 13, 28వ తేదీల్లో కోస్గి, కొడంగల్, మహబూబ్​నగర్​ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం సభలతో పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. 8న నారాయణపేటలో, 19న పాలమూరులో నిర్వహించిన సభల్లో పాల్గొని మాట్లాడారు.

గత మంగళవారం తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్​సెగ్మెంట్​లోని మద్దూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల మీటింగ్​కు అటెండ్​ అయ్యారు. త్వరలో మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో నిర్వహించే క్యాంపెయిన్​లో పాల్గొనున్నారు. సీఎంతో పాటు ఈ పార్లమెంట్​స్థానం పరిధిలోని మహబూబ్​నగర్, మక్తల్, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, షాద్​నగర్​ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికా రెడ్డి, జి.మధుసూదన్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి, వీర్లపల్లి శంకర్​వంశీని గెలిపించుకునేందుకు శ్రమిస్తున్నారు.

వంశీచంద్​రెడ్డి ఏ నియోజకవర్గంలో పర్యటించినా.. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు వెంట ఉంటున్నారు. గత ప్రభుత్వం పదేండ్లుగా పడావు పెట్టిన ‘మక్తల్–​-నారాయణపేట–- కొడంగల్’  స్కీమ్​ను తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సాధించామనే విషయాన్ని ఓటర్లకు వివరిస్తున్నారు. ‘పాలమూరు’ స్కీమ్​కు జాతీయ హోదాను తీసుకురాకపోవడం, నిధులు కేటాయించకపోవడంపై గత రాష్ట్ర, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతున్నారు.

పార్లమెంట్​లో 53 శాతం ఓటర్లున్న  ముదిరాజ్​లను బీసీ(-డీ) నుంచి బీసీ- (ఏ)లోకి మారుస్తామనే హామీ ఇస్తున్నారు. అయితే, మక్తల్​, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోని నియోజకవర్గాల లీడర్లు కింది స్థాయి కేడర్​ను పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీనికితోడు గత ఎన్నికల్లో పని చేసిన వారిని పక్కకు పెట్టి.. పార్టీలో కొత్తగా చేరిన వారికే నియోజకవర్గాల లీడర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆ పార్టీ లీడర్లే చర్చించుకుంటున్నారు.  

గెలవాలనే పట్టుదలతో డీకే అరుణ

మహబూబ్​నగర్ నుంచి రెండోసారి బీజేపీ క్యాండిడేట్​గా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బరిలోకి దిగారు. ఎన్నికల్లో ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే 'విజయ్ ​సంకల్స్​యాత్ర’  పేరుతో అరుణ ఒక టర్మ్​ ఈ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. నియోజకవర్గ కేంద్రంలో ఇంటింటికీ తిరిగి ఓట్లడిగారు. మండల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. మోదీ ఛరిష్మా కలిసొస్తుందనే నమ్మకంతో ఉన్నారు. దీనికితోడు తానే పాలమూరు ప్రాజెక్టుల సాధనలో కీ రోల్​ పోషించానని ఓటర్లకు వివరిస్తున్నారు.

అయితే, సొంత పార్టీ నుంచే ఆమెకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఆ పార్టీ లీడర్​ శాంతికుమార్​కు కాకుండా అరుణకు టికెట్​ ఇవ్వడంతో బీసీ సామాజికవర్గానికి చెందిన లీడర్లు కొందరు పార్టీ వీడారు. మరికొందరు పార్టీలో ఉన్నా పదవులకు రిజైన్​ చేశారు. అలాగే పార్టీ సీనియర్ ​లీడర్​ఏపీ జితేందర్​రెడ్డి, ఆయన వర్గీయులు ఇటీవల కాంగ్రెస్​లో చేరారు. బీసీ లీడర్ ​శాంతికుమార్ ​సైలెన్స్ ​మోడ్​లో ఉండడం కొంత మైనస్ ​అయ్యే అవకాశాలున్నాయి.

ఆలస్యంగా యాక్టివ్​ అయిన మన్నె  

బీఆర్ఎస్​ సిట్టింగ్​ఎంపీ, ఆ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్​రెడ్డి వారం కిందటి వరకు సైలెన్స్​గానే  ఉన్నారు. గత నెల రెండో వారంలోనే ఆయనకు టికెట్ కేటాయించినా ప్రజల్లోకి మాత్రం రాలేదు. ఉగాది తర్వాత ప్రచారం ప్రారంభిస్తారనే టాక్ ​నడిచినా.. అదీ జరగలేదు. ఇటీవల సీఎం పాలమూరు క్యాండిడేట్​ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్​ కుట్రలు చేస్తున్నాయని, ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కనిపించడం లేదని విమర్శించడంతో మన్నె సీన్​లోకి వచ్చారు. నాలుగు రోజుల నుంచి నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.

పార్టీ కేడర్​తో సమావేశమవుతున్నారు. మాజీ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​, మాజీ ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్​ రెడ్డి, ఎస్.రాజేందర్​రెడ్డి మద్దతుగా వస్తున్నారు. ప్రచారానికి 13 రోజులే టైం ఉండడంతో పార్లమెంట్​నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్లడం సాధ్యం కాకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. 

బీఆర్ఎస్ ​ఓట్లు చీలుతాయనే టాక్​..

మహబూబ్​నగర్​ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఘోర పరాభవం ఎదురుకావడంతో డీలా పడింది. ఆ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉండడంతో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని కేడర్​ పార్టీకి దాదాపు దూరమైంది. ఉన్న వారు కూడా సైలెన్స్​ మోడ్​లోకి వెళ్లారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​ఓట్లు చీలుతాయని, అవి ఎటు వెళ్తాయో అన్న చర్చ జరుగుతోంది. 

పదిసార్లు కాంగ్రెస్​.. మూడు సార్లు బీఆర్ఎస్​

మహబూబ్​నగర్ ​లోక్​సభ నియోజకవర్గానికి1952 నుంచి ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి అత్యధికంగా పది సార్లు కాంగ్రెస్​ అభ్యర్థులు విజయం సాధించగా, గత మూడు టర్ముల్లో బీఆర్ఎస్​ క్యాండిడేట్లు వరుస విజయాలు సాధించారు. తెలంగాణ ప్రజా సమితి, జనతాదళ్, జనతా పార్టీ, బీజేపీ ఒక్కొక్కసారి గెలిచాయి. 1952 నుంచి1962 వరకు మూడుసార్లు ఎలక్షన్లు జరగ్గా..1952లో కె.జనార్దన్​రెడ్డి,1957లో జె.రామేశ్వర్​రావు, 1962లో జేబీ ముత్యాల్​రావు కాంగ్రెస్​ నుంచి గెలుపొందారు.

1967లో కాంగ్రెస్​ నుంచి జె.రామేశ్వర్​రావు గెలవగా, 1971 ఎన్నికల్లో ఈయన తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1977లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ ​నుంచి మల్లికార్జున్​గౌడ్​, 1984లో జనతా పార్టీ నుంచి ఎస్.జైపాల్​రెడ్డి ఎన్నికయ్యారు.1989,1991, 1996లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి మల్లికార్జున్​ గౌడ్​ హ్యాట్రిక్​ విజయాలు నమోదు చేశారు. 1998లో జనతాదళ్ నుంచి జైపాల్​ రెడ్డి, 1999లో బీజేపీ నుంచి ఏపీ జితేందర్​ రెడ్డి, 2004లో డి.విఠల్​రావు కాంగ్రెస్​ పార్టీ నుంచి పార్లమెంట్​కు ఎంపికయ్యారు.

2009లో టీఆర్ఎస్​ నుంచి కేసీఆర్, 2014లో అదే పార్టీ నుంచి ఏపీ జితేందర్​రెడ్డి, 2018 ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకే చెందిన మన్నె శ్రీనివాస్​ రెడ్డి విజయం సాధించారు. అత్యధికసార్లు మహబూబ్​నగర్ ​ఎంపీలుగా జె.రామేశ్వర్​రావు, మల్లికార్జున్​ గౌడ్​లు నాలుగు పర్యాయాలు ఎన్నిక కాగా, ఆ తర్వాత ఎస్​.జైపాల్​ రెడ్డి, ఏపీ జితేందర్​ రెడ్డిలు రెండు సార్లు చొప్పున గెలుపొందారు.