కామ్రేడ్లతో కలిసే కాంగ్రెస్ పోటీ!

కామ్రేడ్లతో కలిసే కాంగ్రెస్ పోటీ!
  • సీపీఎం, సీపీఐ నేతలతో చర్చలు షురూ
  • ఆ పార్టీ లీడర్లకు కాల్ చేసిన కాంగ్రెస్ నేత మాణిక్ రావ్‌‌‌‌ ఠాక్రే
  • సీపీఐ సీనియర్ నేతలతో రహస్య భేటీ 
  • నేడో, రేపో సీపీఎం లీడర్లతో మీటింగ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పొత్తుల రాజకీయం షురూ అయింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, లెఫ్ట్ పొత్తు బెడిసికొట్టడంతో, కమ్యూనిస్టులను మంచిక చేసుకునే పనిలో కాంగ్రెస్ పడింది. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్‌‌‌‌తో వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌‌‌‌చార్జి మాణిక్ రావ్‌‌‌‌ ఠాక్రే సీపీఎం, సీపీఐ నేతలతో ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. కాంగ్రెస్‌‌‌‌తో పొత్తుకు ఇరు పార్టీలు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు మద్దతిచ్చిన సీపీఎం, సీపీఐ నేతలు.. ఆ పార్టీతోనే భవిష్యత్‌‌‌‌లో పొత్తులుంటాయని భావించారు. 

అదే విధంగా సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కూడా చర్చలు జరిపారు. కానీ, చివరి నిమిషంలో లెఫ్ట్ పార్టీలతో సంబంధం లేకుండానే, 115 సీట్లలో అభ్యర్థులను ప్రకటించి, ఆ పార్టీలతో పొత్తులేదని స్పష్టం చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీరుపై కమ్యూనిస్టులు సీరియస్‌‌‌‌గా ఉన్నారు. ముందుగా సీపీఎం, సీపీఐ సంయుక్తంగా కలిసి పోటీ చేయాలని, తర్వాత తమతో వచ్చే లౌకిక పార్టీలను కలుపుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఆ పార్టీలు భావించాయి. ఇలాంటి సమయంలో ఒంటరిగా కాకుండా కాంగ్రెస్ లాంటి పార్టీతో కలిసి పోటీ చేయాలని ప్రతిపాదనలు కమ్యూనిస్టుల్లో వచ్చాయి. ఆ పార్టీ చర్చలకు వస్తే ఆలోచించాలని అప్పట్లో అనుకున్నారు. ఇదే సమయంలో రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ నేత మాణిక్ రావ్‌‌‌‌ ఠాక్రే.. సీపీఎం, సీపీఐ నేతలతో ఫోన్‌‌‌‌లో మాట్లాడి, చర్చలకు ఆహ్వానించారు. ఆదివారం సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఉందని, తర్వాత కలుస్తామని వారు తెలిపారు. 

సీపీఐ నేతలతో కాంగ్రెస్ చర్చలు.. 

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఆ పార్టీ సీనియర్ నేతలు చాడ వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా తదితరులు ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఇంట్లో సమావేశమయ్యారు. ఇరు పార్టీల మధ్య పొత్తులపై చర్చించారు. సీపీఐ పోటీ చేయాలనుకునే కొత్తగూడెం, మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, దేవరకొండ తదితర స్థానాల గురించి వివరించారు. దీనిపై జాతీయ, రాష్ట్ర నేతలతో చర్చించి, పొత్తులను కన్ఫమ్ చేసుకుందామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు తెలిసింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్, బీజేపీలను ఓడించాలంటే ఓట్లు చీలొద్దని, కాబట్టి కాంగ్రెస్‌‌‌‌తో పొత్తుకు కలిసి రావాలని సూచించినట్టు సమాచారం. సీపీఐ కోరిన 5 స్థానాల్లో రెండింటిని ఇచ్చేందుకు సిద్ధమనే ఇండికేషన్ కాంగ్రెస్ ఇచ్చినట్టు తెలిసింది. 

గతంలోలాగా చేయొద్దని చెప్పినం..

‘‘కాంగ్రెస్‌‌‌‌తో కలిసి పోటీ చేసే అంశంపై చర్చలు జరిగాయి. కలిసి పోటీ చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పాం. కానీ, 2018లో జరిగినట్టు ఈసారి జరగొద్దని చెప్పాం. ముందే లెఫ్ట్ పార్టీలకు కేటాయించే సీట్లు ప్రకటించాలని సూచించాం. వాళ్లు ఓకే అన్నారు. త్వరలో మరోసారి భేటీ అవుతాం. అప్పుడే పొత్తులపై, సీట్లపై స్పష్టత వస్తుంది’’అని సీపీఐ నేత ఒకరు చెప్పారు. 

సీపీఎం రాష్ట్ర కమిటీలో పొత్తులపై చర్చ..

ఎంబీ భవన్‌‌‌‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఇందులో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, స్టేట్ సెక్రటరీ తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తులపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ తీరుపై చర్చించారు. కాంగ్రెస్‌‌‌‌తో పొత్తుకు ఆహ్వానం రావడం పైనా సానుకూలంగా స్పందించారు. మరో రెండ్రోజుల్లో కాంగ్రెస్‌‌‌‌తో చర్చలు జరిగే అవకాశం ఉందని, గౌరవప్రదమైన సీట్లు ఇస్తే కలిసి పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సీపీఎం, సీపీఐ పోటీ చేసే స్థానాలపై తొలి జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు.