కర్నాటకలో గెలిచేది మేమే... 160‌‌‌‌ స్థానాల్లో విజయం  సాధిస్తాం :  వీరప్ప మొయిలీ

కర్నాటకలో గెలిచేది మేమే... 160‌‌‌‌ స్థానాల్లో విజయం  సాధిస్తాం :  వీరప్ప మొయిలీ

న్యూఢిల్లీ : కర్నాటకలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్​ లీడర్ వీరప్ప మొయిలీ అన్నారు. ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సౌత్ ఇండియాలో గేట్​వేగా ఉన్న కర్నాటకలో ఓట మితో బీజేపీకి అన్ని దారులు మూసుకుపోతాయని విమర్శించారు. బీజేపీకి 60 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బీజేపీతో జేడీ(ఎస్) కుమ్మక్కైందని ఆరోపించారు.

హెచ్​డీ దేవేగౌడ నేతృత్వంలోని అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారన్నారు. బీజేపీకి కర్నాటకలో ఎదురుగాలి వీస్తున్నదని విమర్శించారు. బీజేపీ లీడర్లలో ఐక్యత లోపించిందని, చాలా మంది సీనియర్ లీడర్లకు టికెట్లు దక్కలేదని తెలిపారు. అందుకే బీజేపీని వీడి కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారన్నారు. 

బీజేపీ పాలన అవినీతిమయం

బస్వరాజు బొమ్మై నేతృత్వంలో పాలన పూర్తి విఫలమైందని వీరప్ప మొయిలీ ఆరోపించారు. అవినీతి బాగా పెరిగిపోయిందని, ప్రతీ పనిలో కమీషన్​ తీసుకునే స్థాయికి దిగజారిందని విమర్శించారు. డబుల్​ ఇంజన్​ గవర్నమెంట్ అనేది పేరుకే అని, ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేకపోయిందన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పెద్ద కంపెనీ కూడా కర్నాటకలో ఏర్పాటు కాలేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగంతో పాటు పేదరికం పెరిగిందని, లక్షలాది గవర్నమెంట్​ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఎక్కడికెళ్లినా బీజేపీ అవినీతి గురించే మాట్లాడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు, కేరళ, హిమాచల్​ప్రదేశ్, వెస్ట్​ బెంగాల్​లో మోడీ, అమిత్​షా ప్రచారం చేసినా విజయం సాధించలేకపోయారన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే సీఎంని నిర్ణయిస్తారని, దాన్నే హైకమాండ్​ ఫైనల్​ చేస్తుందని తెలిపారు. సిద్ధరామయ్య, డీకే శివకుమార్​లు కలిసి ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని వివరించారు.