
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 136 సీట్లల్లో విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కంటే 23 సీట్లు అధికంగా గెలిచింది. ఇక బీజేపీ 65 సీట్లు గెలుచుకుని రెండో స్థానానికి పరిమితమైంది. కింగ్ మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ 19 సీట్లతోనే సరిపెట్టుకుంది. ఇతరులు నాలుగు స్థానాల్లో గెలిచారు.
ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఓట్లు ?
136 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ కు 42.88 శాతం ఓట్లు వచ్చాయి. ఇక రెండో స్థానంలో ఉన్న బీజేపీకి 36 శాతం, జేడీఎస్ కు 13.29 శాతం ఓట్లు పడ్డాయి.
సీఎం రేసులో సిద్ధరామయ్య , డీకే శివకుమార్
ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో అనుకూలంగా రావడం, మ్యాజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ సీట్లల్లో అత్యధికత సాధించడంతో సీఎం ఎవరనే చర్చ మొదలైంది. రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ,డీకే శివకుమార్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఎవరిని ఎంపికచేస్తుందనేది ఉత్కంఠగా మారింది .ఇప్పటికే చాలా సార్లుతానే సీఎం అభ్యర్థిని అని సిద్ధరామయ్య ప్రకటించారు. అయితే కర్ణాటకలో పార్టీ గెలుపు కోసం విశేష కృషిచేసిన డీకే శివకుమార్ సీఎం కావాలని పార్టీ నేతలు కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగాపేరున్న డీకే శివకుమార్ కు ఈ అవకాశం దక్కవచ్చనే ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరిలో ఎవరికి సీఎం పదవి కట్టబెట్టినా పార్టీలో సంతృప్తి అసమ్మతిలేకుండా చూసకోవడం జాతీయ నాయకత్వానికి కీలకమైన వ్యవహారంగా మారింది.
14 సీఎల్పీ ..15న ప్రమాణ స్వీకారం
బెంగళూరులోని హిల్టన్ హోటల్ లో రేపు సాయంత్రం 5.30గంటలకు సీఎల్పీ భేటీ కానుంది. ఎమ్మెల్యేలు సీఎల్పీ లీడర్ ను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే సీఎం రేసులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య పోటీపడుతున్నారు. సీఎం అభ్యర్థిగా హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందా అని ఉత్కంఠగా ఉంది. మే 15న కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది.