ప్రాణహితలో మునిగి కాంగ్రెస్ యువనేత మృతి ..శ్రీశైలం మృతి పట్ల మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ దిగ్భ్రాంతి

ప్రాణహితలో మునిగి కాంగ్రెస్ యువనేత మృతి ..శ్రీశైలం మృతి పట్ల మంత్రి వివేక్, ఎంపీ వంశీ కృష్ణ దిగ్భ్రాంతి
  • నదిలో గజఈతగాళ్ల గాలింపు  
  • 24 గంటల తర్వాత లభించిన డెడ్ బాడీ 

కోటపల్లి, వెలుగు: ప్రాణహిత నదిలో మునిగి కాంగ్రెస్ యువ నేత మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యువ నేత దాగమ శ్రీశైలం(25), దీపావళి పండుగ సందర్భంగా 15 మంది ఫ్రెండ్స్ తో కలిసి సోమవారం ఆలుగామ గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లారు. 

నదిలోకి దిగిన తర్వాత లోతు తెలియకపోవడంతో నీటిలో శ్రీశైలం గల్లంతయ్యాడు. ఫ్రెండ్స్ కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఘటనపై సమాచారం అందడంతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే పోలీస్ సిబ్బందికి, గజతగాళ్లకు, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ను ఆదేశించి నది వద్దకు పంపించారు. కోటపల్లి ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో శ్రీశైలం కోసం రాత్రిదాకా గాలించినా ఆచూకీ లభించలేదు. 

మంగళవారం ఉదయం నుంచి మరోసారి గాలింపు ముమ్మరం చేశారు. అర్జున్ గుట్ట సమీపంలో నదిలో డెడ్ బాడీ కనిపించడంతో స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతితో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 

శ్రీశైలం మృతి పట్ల మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  శ్రీశైలం డెడ్ బాడీని చూసేందుకు మండలంలోని పలువురు పార్టీ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.