భయపెడుతున్న కండ్లకలక.. లక్షణాలు, నివారణ మార్గాలివే

భయపెడుతున్న కండ్లకలక..  లక్షణాలు, నివారణ మార్గాలివే

భారీ వర్షాల కారణంగా  కండ్ల కలక కేసులు భారీగా నమోదవుతున్నాయి. కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపుతో పాటు దురదపెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వానలతో తెలుగు రాష్ర్టాల్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. జులై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల్లో  వెయ్యికి పైగా కేసులు నమోదైనట్టు డాక్టర్లు వెల్లడించారు. 

సూర్యాపేట జిల్లా • పాలకవీడు మండలం గుడుగుండ్లపాలెం జ్యోతిరావు పూలే బిసి రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 100 మంది విద్యార్థులకు కండ్ల కలకతో ఇబ్బంది పడుతున్నారు.   కళ్లు ఎర్రబడి నీరు కారడం, కళ్లు మండటం, కళ్లు వాపు నరకం అనుభవిస్తున్నారు. పిల్లలకు కండ్ల కలక రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

కండ్లకలక ఎప్పుడు వస్తుంది..
కండ్ల కలక.... దీనినే పింక్ ఐ అని కూడా అంటారు. ముఖ్యంగా వానాకాలంలోనే  కండ్ల కలక ఇబ్బంది పెడుతుంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువ ఉండటంతో ..ఈ బ్యాక్టీరియా కళ్ళను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా కళ్ళు కండ్ల కలక బారిన పడతాయి.

కండ్లకలక లక్షణాలు ఇవే..
కన్ను ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారుతుంది. 
కంటి దురద, అధికంగా నీరు కారుతుంది.
లైట్ల వెలుగును చూడలేకపోతారు.
జ్వరం, తేలికపాటి గొంతు నొప్పి వస్తుంది. 

కండ్లకలక వస్తే ఇలా చేయాలి..
కండ్లకలక వ్యాధి సోకితే డాక్టర్లను సంప్రదించాలి. కండ్లకు గోరువెచ్చటి కాపడాలు, మెత్తబరిచే కంటి మందు చుక్కలు, మంట నుంచి ఉపశమనం పొందడానికి అనెల్జెసిక్స్‌ వాడొచ్చు. 
అలాగే  కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకోవాలి. మెత్తని, చెమ్మగా ఉన్న టవల్ తో  కంటి స్రావాన్ని సున్నితంగా శుభ్రపర్చుకోవాలి. అయితే ఏది పడితే అది యాంటిబయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ వాడొద్దు.

కండ్ల కలక ఎందుకు వస్తుందంటే..
కండ్ల కలక వైరల్‌, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, పారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుంది. అడెనోవైరస్‌ వంటి ఒక ప్రత్యేక వైరస్‌ల సమూహంతోనూ ఈ సమస్య వచ్చే అవకాశాలున్నాయి. కండ్ల కలక  అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకి వ్యక్తి ఇతరులకు దూరంగా ఉంటూ తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యాధి సోకిన వ్యక్తి తన చేతులతో కండ్లను తాకవద్దు. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

‘ఫోలిక్యూలర్‌ కండ్ల కలక 2 రకాలు. అందులో ఒకటి ‘ఫారింగో-కంజన్టివల్‌-ఫీవర్‌ (పీసీఎఫ్‌). ఇది తేలికపాటి లక్షణాలు కలిగి ఉంటుంది. జలుబు లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్న పిల్లలు, యువకులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
రెండవది ఎపిడమిక్‌ కెరటో కన్జంక్టివైటిస్‌. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలుంటాయి. ఇది కంటి ముందు భాగాన్ని (కార్నియా)ను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక కంటి సమస్యలకు కారణమవుతుంది