10 శాతం అదనపు సుంకం పక్కా.. తగ్గేది లేదు.. బ్రిక్స్ మిత్రదేశాలకు ట్రంప్ వార్నింగ్..

10 శాతం అదనపు సుంకం పక్కా.. తగ్గేది లేదు.. బ్రిక్స్ మిత్రదేశాలకు ట్రంప్ వార్నింగ్..

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్న ట్రంప్ మరో బాంబు పేల్చారు. బ్రిక్స్ మిత్ర దేశాలపై 10 శాతం అదనపు సుంకం విధించనున్నట్లు తెలిపారు ట్రంప్. ఈ మేరకు సోమవారం ( జులై 7 ) రాత్రికి బ్రిక్స్ దేశాలకు లేఖలు పంపుతానంటూ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు ట్రంప్. బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే దేశాలపై 10 శతం అదనపు సుంకం విధిస్తామని.. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేశారు ట్రంప్.

ట్రంప్ టారిఫ్ పాలసీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా ఉందంటూ బ్రిక్స్ తీవ్రంగా విమర్శించిన తరువాత ట్రంప్ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా టారిఫ్ పాలసీ ఏకపక్షంగా ఉందని.. చట్టవిరుద్ధమని.. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది బ్రిక్స్. 

మొదట బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా మరియు దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్, 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, 2025లో ఇండోనేషియాల చేరికతో విస్తరించబడింది. 

10 శాతం అదనపు సుంకం

బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా 10 శాతం అదనపు సుంకం విధిస్తామని.. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని ట్రూత్  వేదికగా పోస్ట్ చేశారు ట్రంప్.

ALSO READ : మీ దగ్గర రూ.23 లక్షలు ఉంటే చాలు.. గోల్డెన్ వీసాతో దుబాయ్‌లో హ్యాపీగా సెటిల్ అవ్వొచ్చు

ట్రంప్ టారిఫ్ పాలసీపై బ్రిక్స్ రియాక్షన్

ఆదివారం ( జులై 6 ) నిర్వహించిన సమావేశంలో అమెరికా టారిఫ్ పాలసీని ఖండించిన బ్రిక్స్.. పరోక్షంగా విమర్శలు చేసింది. ట్రంప్ టారిఫ్ పాలసీ WTO నీదండనలకు విరుద్ధంగా ఉందని.. ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంది బ్రిక్స్. పరస్పర సుంకాల పెంపుపై ట్రంప్ ప్రకటించిన 90 రోజుల గడువు సమీపిస్తున్న క్రమంలో బ్రిక్స్ ప్రకటన కీలకంగా మారింది. 

ఆగస్టు 1 నుంచి కొత్త టారిఫ్ పాలసీ అమల్లోకి రానుందని.. ఈ క్రమంలో సోమవారం ( జులై 7 ) ట్రేడ్ అగ్రిమెంట్ తో సహా కొత్త సుంకాల రేట్లతో కూడిన లేఖను ఆయా దేశాలకు పంపనున్నట్లు తెలిపారు ట్రంప్.