ఆలేరులో ఐలయ్య మార్నింగ్ వాక్ ..50 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

ఆలేరులో ఐలయ్య మార్నింగ్ వాక్ ..50 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

యాదాద్రి, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల వేగవంతంపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం ఆలేరు టౌన్​లో ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ప్రారంభమైన ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కొందరు లబ్ధిదారుల వద్ద నగదు లేనందున ఇండ్లు ముగ్గు వద్దే ఆగిపోతున్నాయని గుర్తించారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు మున్సిపాలిటీలోని 12 వార్డులకు 160 ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో 35 మంది లబ్ధిదారులు ముగ్గు పోయలేదు. 125 ఇండ్ల నిర్మాణానికి ముగ్గులు పోశారు. 

వీరిలో చాలా మంది ఇండ్ల నిర్మాణాలు బేస్మెంట్ లెవల్​కు ఇంకా చేరుకోలేదు. విషయం తెలుసుకున్న ఆయన లబ్ధిదారులను కలిసి నిర్మాణాలు వేగవంతమయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఆలేరుకు చేరుకున్నారు. ఆఫీసర్లను వెంట తీసుకొని దాదాపు 50 ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎందుకు ఆలస్యమవుతుందో అడిగి తెలుసుకున్నారు. అయితే ఇండ్లు వచ్చిన సంతోషం తమకు ఉన్నా..ప్రారంభించడానికి డబ్బు సమకూరడం లేదని చెప్పుకొచ్చారు. దీంతో స్పందించిన ఆయన మహిళా సంఘాల నుంచి రూ.లక్ష వరకు లోన్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బేస్మెంట్ పూర్తి కాగానే బిల్లులు వస్తాయని తెలిపారు. బిల్లుల విషయంలో స్పీడప్​ చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు.