20 రోజుల్లో ఇందిరా డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

20 రోజుల్లో ఇందిరా డెయిరీ యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, వెలుగు :  మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు గా చేపట్టిన ఇందిరా మహిళా డెయిరీకి సంబంధించి కార్యాచరణను  వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం మధిర క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి డీఆర్డీవో, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, సంక్షేమ శాఖ అధికారులతో ఇందిరా డెయిరీ ఏర్పాటుపై సమీక్షించారు. ఇందిరా డెయిరీ  కోసం పశువుల యూనిట్ గ్రౌండింగ్  పూర్తి చేయాలన్నారు. ప్రతీ లబ్ధిదారుడికి రెండు గేదెలు అందజేయాలని, దాంతో పాటు నాలుగు పాడి పశువులకు సరిపడ షెడ్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. 

రానున్న 20రోజుల లోపు నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇందిరా డెయిరీ పథకం ప్రారంభం కావాలని ఆదేశించారు. పాడి పశువుల కొనుగోలు బృందంలో తప్పనిసరిగా ఒక విజిలెన్స్ అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలాంటి  అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో గడ్డి అవసరం ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా గడ్డి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షలో డీఆర్డీవో సన్యాసయ్య, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నవీన్ బాబు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పురేందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి, మధిర వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు విజయచంద్ర, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.