
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ను ఎమ్మెల్సీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్ మండిపడ్డారు. కోదండరాం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్నారు. టీజేఏసీ ద్వారా అన్ని వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ది కోదండరామ్ మీద కుట్ర కాదని.. రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులందరిపై కుట్రగా భావిస్తున్నామన్నారు. ఉద్యమాలు చేసి సీఎంగా పదేండ్లు ఉన్న కేసీఆర్.. ఎవరినీ పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యమాన్ని కేసీఆర్, ఆయన కుటుంబం పదవులు, అధికారం కోసం వాడుకున్నదని విమర్శించారు. ఇప్పటికైనా కోదండరామ్‌పై కుట్రలు మానుకోకపోతే వేలాది మంది ఉద్యమకారులతో బీఆర్ఎస్ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కోదండరామ్‌కు రాజ్యసభ సీటు లేదా మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.