అయోధ్య రామమందిర సమీపంలో తుపాకీ పేలుడు.. కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

అయోధ్య రామమందిర సమీపంలో తుపాకీ పేలుడు.. కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

ఉత్తరప్రదేశ్: పవిత్ర అయోధ్య రామమందిర పరిసరాల్లో ప్రత్యేక భద్రతా దళానికి చెందిన ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం(జూన్ 19) ఉదయం 5:25 గంటల ప్రాంతంలో జరిగింది. కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్‌ను అంబేద్కర్‌నగర్‌కు చెందిన 25 ఏళ్ల శతృఘ్న విశ్వకర్మగా పోలీసులు గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకున్నారా..! లేదా ప్రమాదవశాత్తు జరిగిందా..! అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.

 నివేదికల ప్రకారం, రామమందిరం యొక్క ప్రధాన భాగం నుండి దాదాపు 150 మీటర్ల దూరంలో కోటేశ్వరాలయం ముందున్న VIP గేట్ దగ్గర విశ్వకర్మ నిలబడ్డారు. సంఘటనా సమయంలో అతనితో పాటు పలువురు భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారు. బుల్లెట్ విశ్వకర్మ నుదిటికి తగిలిన క్షణాల్లో నేలకొరిగాడు. సహచరులు వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు.

భద్రతా దళ సెక్యూరిటీ గార్డు మృతితో ఆలయ ప్రాంగణంలో కలకలం రేగింది. ఘటనాస్థలిని సందర్శించిన సీనియర్ పోలీసు అధికారులు ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించింది. ఫోరెన్సిక్ నివేదికలు, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ఖచ్చితమైన కారణం ఏంటనేది తెలుసుకుంటామని ఫైజాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. ఘటన జరగడానికి కొన్ని నిమిషాల ముందు విశ్వకర్మ తన మొబైల్ ఫోన్‌ చూస్తున్నట్లు సహోద్యోగులు తెలిపారు.

శత్రుఘ్న విశ్వకర్మ స్వస్థలం అంబేద్కర్‌నగర్‌లోని సమ్మన్‌పూర్‌లోని కాజ్‌పురా గ్రామం. అతను 2019లో UPSSF దళంలో చేరాడు. మృతుడి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.