ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్

ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్

కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. అయితే ఒక్క నిమిషం నిబంధనలను కఠినంగా అమలు చేశారు పోలీసులు. పరీక్షా కేంద్రాల దగ్గర  144 సెక్షన్  అమలు చేశారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. చాలా చోట్ల ఎగ్జామ్ కు లేటు వచ్చిన అభ్యర్థులు, లోపలికి అనుమతించక పోవడంతో వెనుదిరిగారు. కొన్ని చోట్ల పోలీసుల కాళ్లు పట్టుకుని బతిమిలాడిన పరిస్థితి కనిపించింది. కానీ లేట్ గా వచ్చిన అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించలేదు అధికారులు. దీంతో కొన్ని చోట్ల యువతీ యువకులు కన్నీటి పర్యంతం అయ్యారు. తాము ఈ పరీక్ష కోసం ఎంతో కాలం నుంచి ప్రిపేర్ అయ్యామని, ఆ కష్టం అంతా వృథా అయ్యిందని ఆవేదన చెందారు.

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాలు, నగరాల్లో పరీక్ష కేంద్రాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మొత్తం 15,644 పోస్టులకు 9.54 లక్షల మంది దరఖాస్తులు చేశారు. గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా, పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చేతులకు మెహిందీ, టాటూలు ఉండకూడదని నిబంధన విధించారు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదన్న నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనల మేరకు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అభ్యర్థులను లోపలికి పంపించారు. ఈ సారి 16,321 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.