15 ఏండ్లుగా నిర్మాణ దశలోనే 788 ఫ్లాట్లు

15 ఏండ్లుగా నిర్మాణ దశలోనే 788 ఫ్లాట్లు

కూకట్​పల్లి, వెలుగు: రాష్ట్ర హౌసింగ్ బోర్డు అధికారుల నిర్లక్ష్యంతో  రూ.కోట్ల ఖర్చుతో మొదలుపెట్టిన 788 ఇండ్ల నిర్మాణం 15 ఏండ్లుగా పూర్తి కావడం లేదు. జాయింట్ ​వెంచర్​లో భాగంగా ఓ ప్రైవేట్​ నిర్మాణ సంస్థ వీటిని పూర్తిచేయాల్సి ఉండగా చేయలేదు. నిర్మాణ సంస్థ తన భాగంలోని ఫ్లాట్లను అమ్మేసు కుని వీటిని గాలికొదిలేసింది. కేపీహెచ్​బీ కాలనీ ఏడో ఫేజ్ నుంచి హఫీజ్​పేటకు వెళ్లే దారిలో 75 ఎకరాల హౌసింగ్ ​బోర్డు భూమి ఉంది. ఉమ్మడి ఏపీలో 2004లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బోర్డు అధికారులు ఇక్కడ ‘ఇందు’ పేరుతో జాయింట్​వెంచర్ ప్రాజెక్ట్ ​స్టార్ట్ ​చేశారు. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ తక్కువ ధరకు పనులను దక్కించు కుంది. 788 ఎల్​ఐజీ(లోయర్ ​ఇన్​కమ్ ​గ్రూప్) ఫ్లాట్లను జీ ప్లస్ 5 పద్ధతిలో నిర్మించి బోర్డుకి అప్పగించాలి.

మిగిలిన స్థలంలో సదరు ప్రైవేట్​సంస్థ నిర్మాణాలు చేసి అమ్ముకోవచ్చు. ఒప్పందం ప్రకారం 15 ఏండ్ల క్రితమే ఒకేసారి ఎల్​ఐజీ ఫ్లాట్ల నిర్మాణం, ప్రైవేటు సంస్థ విల్లాలు, అపార్ట్​మెంట్ల నిర్మాణం మొదలైంది. అయితే, కొన్నేండ్ల వ్యవధిలోనే సదరు కంపెనీ తన వాటాకు వచ్చిన భూమిలో విల్లాలు, అపార్ట్​మెంట్ల నిర్మాణం పూర్తిచేసి అమ్మేసుకుంది. హౌసింగ్​బోర్డుకి అప్పగించాల్సిన 788 ఫ్లాట్ల నిర్మాణాన్ని వదిలేసింది. ఇప్పటికీ వాటి నిర్మాణం పూర్తి కాలేదు. ఏండ్లుగా అలాగే ఉన్నా హౌసింగ్​బోర్డు పట్టించుకోవడం లేదు. సదరు సంస్థ పూర్తిచేసి అధికారికంగా బోర్డుకి అప్పగించిన తర్వాతే జనాలకు కేటాయించే అవకాశం అధికారులకు ఉంటుంది. హైటెక్​ సిటీకి, ఈ వెంచర్​కు మధ్యలో రైల్వే ట్రాక్ ​మాత్రమే ఉంది. దీంతో ఇక్కడి ఫ్లాట్లకి విపరీతమైన డిమాండ్ ఉంది. బోర్డు కలగజేసుకుని సదరు సంస్థతో పూర్తిచేయిస్తే వేలల్లో అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది.