హైరైజ్ బిల్డింగుల జోరు .. గ్రేటర్ సిటీలో పుంజుకుంటోన్న రియల్ ఎస్టేట్​

హైరైజ్ బిల్డింగుల జోరు .. గ్రేటర్ సిటీలో పుంజుకుంటోన్న రియల్ ఎస్టేట్​
  • హెచ్ఎండీఏకు భారీగా పెరుగుతోన్న అప్లికేషన్లు  
  • లోక్ సభ ఎన్నికల తర్వాత ల్యాండ్​కన్వర్షన్​కు పర్మిషన్ వచ్చే చాన్స్

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్​సిటీలో హైరైజ్ (బహుళ అంతస్తులు) బిల్డింగుల నిర్మాణాల జోరు ఊపందుకుంది. మూడు నెలలుగా రియల్​ఎస్టేట్​భారీగా పుంజుకుంటోంది. ఇందుకు కారణం హెచ్ఎండీఏకు వస్తున్న దరఖాస్తులేనని అధికారులు వెల్లడించారు. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే భవిష్యత్ లో  హైదరాబాద్​లో రియల్​ఎస్టేట్​మరింతగా పెరగనుందని, ఇటీవల నైట్ ఫ్రాంక్​సంస్థ ఒక రిపోర్ట్ ను ప్రకటించింది. 

ఇందులో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే టాప్​–10 నగరాల జాబితాలో హైదరాబాద్​4వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. అందులో సిటీలో రియల్​ఎస్టేట్​అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కూడా స్పష్టం చేసింది. ఇందుకనుగుణంగా ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు రానున్నట్టు కూడా అధికారులు తెలిపారు. ఒక సంస్థ ఐటీ కారిడార్​లో ఏకంగా 60 అంతస్తుల భవన నిర్మాణానికి అప్లై చేసుకుందని హెచ్ఎండీఏకు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో  రాబోయే రోజుల్లో సిటీలో 60 నుంచి 70 అంతస్తుల భవనాల నిర్మాణం కూడా భారీగా పెరిగే చాన్స్ ఉందని అధికారుల అంచనా ద్వారా తెలుస్తుంది.
 
పర్మిషన్లకు పెరిగిన దరఖాస్తులు 

​సిటీలో హైరైజ్ నిర్మాణాలు, అపార్ట్​మెంట్స్​, విల్లాలు వంటివి మరింత ఎక్కువ నిర్మించనున్నారు. గతేడాది డిసెంబరు వరకు హైరైజ్ భవనాల నిర్మాణానికి, లే అవుట్లు, వెంచర్లకు సంబంధించి నెలకు10లోపే అప్లికేషన్లు వచ్చేవి. గత మూడు నెలలుగా నెలకు 15 నుంచి 20 వరకు  వస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో రెండు నెలలకోసారి జరిగే మల్టీస్టోరీడ్​బిల్డింగ్​ (ఎంఎస్ బీ) కమిటీ మీటింగ్ కూడా నెల రోజుల నుంచి వారానికోసారి జరుగుతుంది. 

 కమిటి మీటింగ్ లో హై రైజ్​భవన నిర్మాణాలు, లే అవుట్లు, వెంచర్లకు పర్మిషన్లు ఇస్తున్నట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిని కూడా మరింత విస్తరించాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రస్తుతం 7,350 చ. కి.మీ. ఉంది. మరోవైపు హెచ్ఎండీఏ అదనంగా 100 చ. కి.మీ. పెరిగే చాన్స్ ఉంది. దీంతో రాబోయే కాలంలో భారీ నిర్మాణాల జోరు మరింతగా పెరగనుందని చెప్పొచ్చు. 

ల్యాండ్​కన్వర్షన్​ పై వీడని సస్పెన్స్!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ల్యాండ్​కన్వర్షన్​( భూ మార్పిడి) కు అనుమతులు భారీగా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఇష్టారాజ్యంగా ఆనాటి ప్రభుత్వ పెద్దలు వ్యవహరించినట్టు స్పష్టం అవుతుంది. వ్యవసాయ భూమిని నివాస ప్రాంతాలుగా, మరికొన్ని చోట్ల నివాస ప్రాంతాల భూములను కమర్షియల్​భూములుగా చేసుకునేందుకు ల్యాండ్​కన్వర్షన్​కింద పెద్దసంఖ్యలో పర్మిషన్లు ఇచ్చారు.

ఎన్నికల ముందే జీవో 111 ఎత్తేస్తామని ప్రభుత్వం ప్రకటించగా భూ మార్పిడుల కోసం అధికసంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఆ జీవో పరిధిలోని జనవాడ, అజీజ్​నగర్​, పెద్ద మంగళారం,చిలుకూరు వంటి ప్రాంతాల్లోని రియల్​వ్యాపారులు ల్యాండ్ కన్వర్షన్​కు ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కొన్ని దరఖాస్తులకు అప్పట్లోనే పర్మిషన్లు కూడా ఇచ్చినట్టు సమాచారం. 

కాగా భూ మార్పిడులపై ఉన్నతస్థాయిలో వస్తున్న ఒత్తిడిలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత ప్రభుత్వం కూడా త్వరలోనే ల్యాండ్  కన్వర్షన్​పై నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. హెచ్ఎండీఏ అధికారులు సైతం ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.  లోక్ సభ ఎన్నికల తర్వాత ల్యాండ్​ కన్వర్షన్​పై నెలకొన్న స్తబ్ధతను తొలగించే చాన్స్ ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ల్యాండ్​కన్వర్షన్​కు అనుమతులిస్తే హెచ్​ఎండీఏకు భారీగా ఆదాయం సమకూరనుందని అంటున్నారు.