వార్దా ప్రాజెక్ట్​ ఇప్పటికే లేట్ అయింది..

వార్దా ప్రాజెక్ట్​ ఇప్పటికే లేట్ అయింది..
  • మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి
  • రజత్​కుమార్, స్మితా సబర్వాల్​తో కలిసి ప్రాజెక్టుల పరిశీలన 

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్​టౌన్, వెలుగు: ఇప్పటికే వార్దా ప్రాజెక్ట్  నిర్మాణం లేట్ అయ్యిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం గుండాయి పేట్ సమీపంలో వార్దా నదిపై బ్యారేజ్ నిర్మాణం కోసం స్థలాన్ని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జడ్పీ చైర్ పర్సన్ తో కలిసి ఆయన పరిశీలించారు. వార్దా నది వద్ద బ్యారేజి నిర్మాణం చేపట్టేందుకు అనువుగా ఉందని, దీనిపై ఇప్పటికే వ్యాప్కోస్ సంస్థ, ఇరిగేషన్ అధికారులు ప్లాన్ రెడీ చేసి అందించారని చెప్పారు.

త్వరగా ప్రాజెక్ట్ ఫైనల్ చేసేందుకు స్మితా సబర్వాల్, రజత్ కుమార్ శ్రద్ధ తీసుకోవాలని కోరారు. వార్దాపై కట్టే ప్రాజెక్ట్ తో సిర్పూర్ టీ, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో 1.2 లక్షల ఎకరాలకు, చెన్నూర్ లో అన్నారం బ్యారేజీకి లింక్ గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో 90 వేల ఎకరాలకు నీరు అందుతుందని అన్నారు. అనంతరం జైనథ్‍ మండలం పెన్​గంగాపై నిర్మిస్తున్న చనాఖ కోర్ట బ్యారేజీ పనులను పరిశీలించారు. వేసవిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్  వద్ద  నిర్మిస్తున్న సదర్మాట్ బ్యారేజీ పనులను పరిశీలించారు. ఏప్రిల్ లోగా పనులు పూర్తి చేయాలని స్మితాసబర్వాల్ ఆదేశించారు.