
తిమ్మాపూర్, వెలుగు: ఆవులను తరలిస్తున్న కంటైనర్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎల్‌ఎండీ ఎస్‌ఐ చేరాలు వివరాల ప్రకారం.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి 47 ఆవులను ఓ కంటైనర్‌లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. కరీంనగర్ సమీపంలోని రేణిగుంట టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కంటైనర్‌ను పట్టుకున్నారు. వాహనంలో ఎక్కువ సంఖ్యలో ఆవులను ఎక్కించగా ఊపిరాడక మూడు చనిపోయి ఉన్నాయి. మరికొన్ని అపస్మారక స్థితిలో ఉండగా వెటర్నరీ డాక్టర్‌ను పిలిపించి ట్రీట్‌మెంట్ చేయించారు. అనంతరం గోశాలకు తరలించగా మరో 2 ఆవులు చనిపోయాయి. కాగా మరో 4 ఆవుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెటర్నరీ డాక్టర్లు తెలిపారు. ఈ విషయమై విశ్వ హిందూ పరిషత్ గోరక్షక్ ప్రముఖ్ ఊట్కూరి రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.