ఐదుకు పైగా కేసులొస్తే కంటెయిన్​మెంట్ జోన్

ఐదుకు పైగా కేసులొస్తే కంటెయిన్​మెంట్ జోన్
  • సిటీలో రద్దీగా ఉండే బస్తీలు, కాలనీలపై ఫోకస్
  • పాజిటివ్​వచ్చిన వారిపై 24 గంటలు పర్యవేక్షణ
  • ఐసోలేషన్​ సెంటర్లు కూడా పెట్టాలంటున్న వైద్య నిపుణలు

హైదరాబాద్​, వెలుగు: కరోనా సెకండ్​వేవ్​తో గ్రేటర్ లో రోజురోజుకు   కేసులు ఎక్కువవుతున్నాయి.  ముఖ్యంగా రద్దీగా ఉండే  బస్తీలు, కాలనీలపై  జీహెచ్ఎంసీ, వైద్యాధికారులు దృష్టి పెట్టారు. కరోనా వస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు రెడీ అవుతున్నారు . ఒక ఏరియాలో 5 నుంచి 10  కరోనా కేసులు వస్తే  ఆ ఇండ్ల వరకు మైక్రో కంటెయిన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తారు.  చుట్టు పక్కల ప్రాంతాల్లో కొవిడ్​ రూల్స్​ పాటించేలా చూడడంతో పాటు  జాగ్రత్తలపై అవేర్​నెస్​ కల్పిస్తారు.  గతేడాది పెట్టినట్టుగా కంటెయిన్​ మెంట్​జోన్ల ఏర్పాటు కష్టమేనని అధికారులు అంటున్నారు. బల్దియా హెడ్​ఆఫీసులోనూ పాజిటివ్​లు పెరుగుతుండగా, ఇప్పటికే 10 మంది పైగా కరోనా బారిన పడ్డారు.  దీంతో బల్దియా స్టాఫ్ కి షిఫ్ట్​ల వారీగా, గ్రూపులుగా డివైడ్​ చేసి  పనిచేసేలా,  అవకాశం ఉన్న వారికి వర్క్ ఫ్రమ్​ హోమ్​ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

తీవ్రతను గుర్తించి జోన్లు ఏర్పాటు 
ప్రస్తుతం సిటీలో వైరస్  తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రప్రభుత్వం హెల్త్​ బులిటెన్​లో ప్రకటిస్తున్న కేసులకు మూడింతలు పైగా నమోదవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కరోనా కేసుల కట్టడికి జీహెచ్ఎంసీ, వైద్యారోగ్యశాఖ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాయి. మైక్రో కంటెయిన్ మెంట్​ జోన్ల ఏర్పాటుకు ఇంట్రెస్ట్​ చూపుతున్నారు. ముందుగా వైరస్​ తీవ్రత ఎక్కడ ఉందని గుర్తించి, ఆ తర్వాత అవసరమున్న ప్రాంతాల్లో మైక్రో కంటెయిన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తారు. ఒక బస్తీలో 5  కేసులు వస్తే  అక్కడ మైక్రో కంటెయిన్ మెంట్ జోన్ ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకుంటారు. బల్దియా, హెల్త్​ స్టాఫ్ తో పాటు అవసరమైతే పోలీసులు కూడా పర్యవేక్షిస్తారు.  

రద్దీగా ఉండే బస్తీలు, కాలనీలపై ఫోకస్ 
గతేడాది కరోనా కేసులు వచ్చిన ప్రాంతాల్లో కంటెయిన్ మెంట్ జోన్లను పటిష్టంగా ఏర్పాటు చేశారు. జోన్ లోపల ఉండే వారు బయటకు వెళ్లకుండా, లోపలికి పోకుండా 24 గంటలపాటు పర్యవేక్షించారు. ప్రతి కంటెయిన్ మెంట్ జోన్​వద్ద బల్దియా, హెల్త్, పోలీసు, రెవెన్యూ  స్టాఫ్ ఉన్నారు.  లోపల ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లను చేశారు.  ప్రస్తుతం అలా చేయడం కష్టమే. కంటెయిన్ మెంట్ జోన్​ ఏర్పాటు చేసినా కూడా పబ్లిక్​ నుంచి సపోర్టు ఉండకపోవచ్చని కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో జనం ఎక్కువగా నివసించే బస్తీలు, కాలనీలపై ఫోకస్​పెట్టారు. 

సిటీ నలువైపులా సెంటర్లు.. 
హోమ్ ఐసోలేషన్​లో ఉండేందుకు వీలు లేని వారికి ప్రభుత్వం ఐసోలేషన్​ ఫెసిలిటీ కల్పించాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.  ఒకే రూమ్​, సింగిల్ బెడ్​రూమ్ లో నలుగురి కంటే ఎక్కువగా నివసించే వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండడం కొంచెం కష్టమేనని, అలాంటి వారి కోసం ఇంటికి సమీపంలోనే ఉండే కమ్యూనిటీ హాల్లో ఐసోలేషన్​ ఉండేందుకు సదుపాయాలు కల్పిస్తే కరోనాను త్వరగానే కట్టడి చేయొచ్చంటున్నారు. లేకపోతే సిటీ నలుమూలలా 500 నుంచి 1000 బెడ్స్​తో ఐసోలేషన్​ సెంటర్లు ఏర్పాటు చేసి హోమ్ ఐసోలేషన్ లో ఉండేందుకు వీలులేని వారిని అక్కడ ఉంచాలని సూచిస్తున్నారు.

ఐసోలేషన్​ ద్వారానే వైరస్​ నియంత్రణ
టెస్టింగ్​, ట్రేసింగ్, ట్రీటింగ్ పై దృష్టి పెడితే కరోనాను త్వరగా కంట్రోల్​చేయొచ్చు. పాజిటివ్​వారికి ముందుగా యాంటిబాడీస్​ చెక్​ చేసి,  డెవలప్ అయ్యేలా చూడాలి. అవసరమైతే కరోనా వ్యాక్సిన్​ కూడా ఇవ్వొచ్చు. తద్వారా యాంటిబాడీస్​ డెవలప్​ అయ్యే అవకాశం ఉంది. కంటెయిన్ మెంట్ జోన్లు ఏర్పాటు మంచిదే. కానీ ఐసోలేషన్​ ద్వారానే వైరస్​ని నియంత్రించాలి. ఇంట్లో ఐసోలేషన్​ అయ్యేందుకు వీలు లేని వారికి ప్రభుత్వం ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలి.  
‑ డాక్టర్​విజయ్​భాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్​అండ్ రిసెర్చ్  చైర్మన్​