కలుషితమవుతున్న భూగర్భ జలాలు.. పంట పొలాల్లోంచి దుర్వాసన

కలుషితమవుతున్న భూగర్భ జలాలు.. పంట పొలాల్లోంచి దుర్వాసన
  • మికల్​ వేస్టేజీని ఆరుబయట వదిలేస్తున్న కంపెనీలు
  • కలుషితమవుతున్న భూగర్భ జలాలు
  • పంటలు పండక నష్టపోతున్న రైతులు

చౌటుప్పల్, వెలుగు: హైదరాబాద్​కు సమీపాన ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్, భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్​ మండలాలు కాలుష్యం బారిన పడ్డాయి. కెమికల్ కంపెనీల ఏర్పాటుతో ఉపాధి దొరుకుతుందని సంబరపడ్డ ఈ ప్రాంతవాసులు నేడు ఆ కంపెనీల కాలుష్యంతో పంటలు పండక, పశువులు సైతం ఆ భూముల్లో గడ్డి తినక అరిగోస పడుతున్నారు. సాగు చేయలేక.. భూములమ్ముదామనుకున్నా ఎవరూ ముందుకు రాక పొట్టపోసుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. చౌటుప్పల్, భూదాన్​ పోచంపల్లి, బీబీనగర్, నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలాల్లో గత మూడు దశాబ్దాలలో పెద్ద ఎత్తున కెమికల్ కంపెనీలు వెలిశాయి. ప్రస్తుతం 80 వరకు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఇంటర్మీడియట్, బల్క్ డ్రగ్​ కంపెనీలు ఉన్నాయి. కంపెనీల నుంచి వెలువడే కెమికల్​ వేస్టేజీని ట్రీట్​మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేయాలి. ఒకవేళ కంపెనీలో ట్రీట్​మెంట్​ ప్లాంట్​ లేకపోతే, ట్యాంకర్లలో ఎత్తి ప్రభుత్వ ఆధ్వర్యంలో మెదక్​ జిల్లా జీడిమెట్లలో నడిచే కామన్​ ట్రీట్​మెంట్ ప్లాంట్​కు పంపించాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో కంపెనీ యాజమాన్యాలు ఆరుబయట వదిలేస్తున్నాయి. లేదంటే ట్యాంకర్లలో ఎత్తి రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశాల్లో, మూసీ కాలువల్లో, హైదరాబాద్​లోని నాలాల్లో పారబోయిస్తున్నాయి. కంపెనీల్లోనే ట్యాంకులు, డ్రమ్ముల్లో నిల్వ చేయించి, వర్షం వచ్చిన రోజు వాన నీటిలో కలిపి వదిలేస్తున్నాయి. బోర్ల ద్వారా భూమిలోకి వదులుతున్నాయి.

పంట పొలాల్లోంచి దుర్వాసన
కెమికల్​ వేస్టేజీని ఆరుబయట వదలడంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. బోర్లలో నీళ్లకు బదులు రసాయన జలాలు వస్తున్నాయి. చౌటుప్పల్​ మండలం మల్కాపురం, కొయ్యలగూడెం, ఎల్లగిరి, ఎల్లంబావి, కొయ్యలగూడెం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, తంగడపల్లి, లింగారెడ్డిగూడెం, ఎస్​.లింగోటం, మందోళ్లగూడెం, లింగోజిగూడెం, ఆరెగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, కాట్రేవు, భూదాన్​ పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, జుబ్లక్​పల్లి, నారాయణగిరి, బీబీనగర్​ మండలం కొండమడుగు, బీబీనగర్​, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాల్లోని కంపెనీల చుట్టుపక్కల పంట పొలాల్లోంచి ముక్కుపుటాలదిరేలా కెమికల్స్​ వాసన వస్తోంది. భూములన్నీ మురుగు కాల్వల్లా బురదతో నల్లగా మారాయి. పంటలు పండడం లేదు. ఏ పంట వేసినా మొక్కలు బతకడం లేదు. ఒక వేళ బతికినా కాత, పూత రావడం లేదు. ఆ పొలాల్లో వరిపంట వేస్తే ఒక్క వడ్లిత్తు కూడా దక్కడం లేదు. ఈ పొలాల్లోంచి వచ్చే గడ్డిని పశువులు సైతం తినడం లేదంటే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

పట్టించుకోని సర్కారు 
రెండు దశాబ్దాలుగా పొల్యూషన్​తో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్ద కాలంగా కాలుష్యం మరింత ఎక్కువైంది. అయినప్పటికీ సర్కారుకు పట్టడం లేదు. ప్రజలు పీసీబీకి ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా తనిఖీలు చేస్తూ కంపెనీల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారు.  పొల్యూషన్​ బారిన పడ్డ పల్లెల జనం, రైతులు తహసీల్దార్, ఆర్డీవో ఆఫీసుల ఎదుట ఆందోళన, ధర్నాలు సైతం చేశారు. రాష్ట్ర పీసీబీ, హెచ్ఆర్సీ, ఎన్జీటీలో ఫిర్యాదు చేసి పోరాడుతున్నా కంపెనీల పొల్యూషన్​ మాత్రం ఆగడం లేదు. కంపెనీల కారణంగా వాటర్​తోపాటు ఎయిర్​ పొల్యూషన్​ కూడా ఎక్కువైంది. పిల్లలు, పెద్దలు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు.  కంపెనీలున్న ఏరియాల్లోని గ్రామాల్లో చిన్న పిల్లలు ఎక్కువగా అస్తమా వ్యాధికి గురవుతున్నారు. ఆయా గ్రామాల్లో స్థానికంగా లభించే బోరు నీళ్లతో స్నానం చేసిన ఎంతోమంది చర్మ వ్యాధులకు గురయ్యారు. 

వేస్టేజీ తరలింపునకు కెమికల్ మాఫియా
కెమికల్​ కంపెనీల నుంచి వెలువడే వేస్టేజీని ట్యాంకర్లలో ఎత్తి రాత్రిపూట ఆరుబయట పారబోయించడం చట్ట విరుద్ధం. ఇది పారబోసిన చోట గడ్డి, చెట్లు చనిపోయి భూసారం దెబ్బతింటోంది. పారబోసిన చోట దుర్వాసన వస్తోంది. విషయం గుర్తించి జనం ట్యాంకర్లకు ఎదురు తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో ట్యాంకర్ల తరలింపుదారులు మాఫియా అవతారమెత్తారు. అధికారులను మామూళ్లతో మచ్చిక చేసుకుంటూ, ట్యాంకర్లకు ఎదురు తిరిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. ఇదే క్రమంలో కొంతమంది యువకులను కూడగట్టుకొని, గుంపుగా వెళ్లి ట్యాంకర్లను ఆపడం, డబ్బులు తీసుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. కొంతమంది లీడర్లు ఇలా ట్యాంకర్లను వెంబడిస్తూ పట్టుకొని లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు.

కంకులకు వడ్లు రాలే
తరతరాలుగా మాకు వ్యవసాయమే జీవనాధారం. నాకున్న ఎనిమిదెకరాల్లో 2 ఎకరాల్లో వరి వేసిన. రూ. 30 వేలు పెట్టుబడిగా పెట్టిన. నాటు వేశాక చేను ఏపుగా పెరిగింది. వరి కోత దశకు వచ్చింది. కానీ కంకులకు వడ్లు లేవు. ఇటీవల వాన నీటితో కలిసి కెమికల్​ వేస్టేజీని కూడా వదలడంతో చేనులో నీరు చేరి పంట  కుళ్లిపోయింది. పెట్టిన పెట్టుబడంతా లాసైన.  
– బద్దం ప్రతాప్​రెడ్డి, దోతిగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా