జనగామ బీఆర్ఎస్​ అభ్యర్థి పల్లా, కాంగ్రెస్ ​అభ్యర్థి కొమ్మూరి పోటా పోటీ ప్రకటనలు..

జనగామ బీఆర్ఎస్​ అభ్యర్థి పల్లా, కాంగ్రెస్ ​అభ్యర్థి కొమ్మూరి    పోటా పోటీ ప్రకటనలు..

జనగామ, వెలుగు : ఎన్నికలు ముగిశాయి. అందరి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ప్రధానపార్టీల అభ్యర్థులు మాత్రం గెలుపుపై ఎవరి ధీమాలో వాళ్లున్నారు. కానీ, బయటకు మాత్రం ఎవరూ మాట్లాడడం లేదు. జనగామ సెగ్మెంట్​పై మొదటి నుంచీ ఆసక్తి నెలకొనగా, ఇక్కడ బీఆర్ఎస్​అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి, కాంగ్రెస్​అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్​రెడ్డి మధ్య ఉత్కంఠ పోరు నడిచింది. ఈ ఇద్దరు నేతలు శుక్రవారం మీడియా ముందుకు వచ్చి గెలుపు నాదంటే నాదని మాట్లాడారు. పైగా తనకు ఏకంగా 50వేల మెజారిటీ వస్తుందని పల్లా జోస్యం చెప్పడం విశేషం.

నేను గెలుసుడు పక్కా

జనగామలో తాను గెలువబోతున్నట్లు బీఆర్ఎస్​అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలపై కొంచెం అనుమానం కూడా లేదన్నారు. శుక్రవారం ఆయన రైతు బంధు సమితి రాష్ర్ట అధ్యక్షుడు తాటికొండ రాజయ్యతో కలిసి జనగామ జిల్లా పార్టీ ఆఫీస్​ లో మాట్లాడారు. నియోజకవర్గంలోని 131 గ్రామాలు, జనగామలోని 30 వార్డులు, చేర్యాలలో 12 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి కలిసే అవకాశం వచ్చిందన్నారు. అన్ని వర్గాల వారు తనకు అండగా నిలిచారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని విపక్షాలు చూసినా విచక్షణతో ఓటేశారన్నారు. బీజేపీ తాడు బొంగరం లేని పార్టీ అని, దాని అభ్యర్థి చిన్న పిల్లాడిగా వ్యవహరించిండన్నారు. సీపీఎం నాయకుడు గూండాలా ప్రవర్తించాడన్నారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టామన్నారు. ఎన్నికలఅధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్​ పాగాల సంపత్ రెడ్డి, మున్సిపల్​ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య, మార్కెట్ చైర్మన్ బాల్దె సిద్ధిలింగం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, నిమ్మతి మహేందర్ రెడ్డి, పసుల ఏబె పాల్గొన్నారు.

భారీ మెజారిటీతో గెలుస్తా..

పదేండ్ల కేసీఆర్​అహంకార పాలన అంతం కాబోతున్నదని, కాంగ్రెస్​ అధికారంలోకి వస్తున్నదని జనగామ డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామలోని తన క్యాంపు ఆఫీస్​ లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్​ ఘన్​పూర్​మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలువబోతున్నారని జోస్యం చెప్పారు. జనగామలో డబ్బు సంచులతో గెలుద్దామనుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి ఓడిపోవడం ఖాయమన్నారు. జనగామలో గతంలో ఎన్నికలు సామరస్యంగా జరిగేవని, పల్లా నాన్​లోకల్​నుంచి రౌడీలను తీసుకువచ్చి గొడవలు సృష్టించాడని ఆరోపించారు. దొంగ ఓట్లతో గెలవాలని చూడడమే కాకుండా కాంగ్రెస్​ కార్యకర్తలపై దాడులు చేయించాడన్నారు. అయినా జనం కాంగ్రెస్​కే ఓటేశారన్నారు. చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, కంచ రాములు, చారబుడ్ల దయాకర్ రెడ్డి, మచ్చ వరలక్ష్మీ, దాసరి కళావతి, వంగాల మల్లారెడ్డి, బనుక శివరాజ్ యాదవ్, దాసరి క్రాంతి, పిట్టల సతీష్​, నల్లగొని వేణు, అనిల్, లింగాల వెంకట్ రెడ్డిలు పాల్గొన్నారు.