సిటీ శివారులో టఫ్ ఫైట్!  .. రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం

సిటీ శివారులో టఫ్ ఫైట్!  .. రంగారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో పోటీ రసవత్తరం
  • రెండు పార్టీల మధ్యే   ప్రధానంగా పోరు
  •  గెలుపు అవకాశాలపై ధీమాలో కాంగ్రెస్
  •  23 ఏళ్ల తర్వాత ప్రత్యర్థి నుంచి    మంత్రి సబితకు పోటీ 
  • ఎల్ బీనగర్​లో త్రిముఖ పోటీ
  • కొన్ని చోట్ల టికెట్లు కేటాయించని బీజేపీ 
  •  ఆశావహులు.. కేడర్ లో నెలకొన్న టెన్షన్

ఎల్ బీనగర్, వెలుగు :  రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సిటీ శివారు జిల్లా రంగారెడ్డిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా ఉంది. ప్రధాన పార్టీ నేతలు అధిష్టానానికి దగ్గరగా ఉండటం కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. శివార్లలో షాద్ నగర్, చేవెళ్ల, ఎల్ బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి స్థానాలు ఉన్నాయి. సిటీకి ఆనుకొని గ్రేటర్​లోని శివారు సెగ్మెంట్ల నుంచి టికెట్ ఆశించే వారితో పాటు పోటీలో ఉండేవారు కూడా ఎక్కువగానే ఉంటారు. దీంతో ముందుగానే బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా తొలి, రెండో జాబితాలో అభ్యర్థులను ఫైనల్ చేసింది. బీజేపీ మాత్రం అభ్యర్థులను ఇంకా పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నుంచే అభ్యర్థులను ఖరారు చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ క్యాడర్​లో అభ్యర్థులపై క్లారిటీ వచ్చింది. మరోవైపు బీజేపీ ఆశావహుల్లోనూ, క్యాడర్​లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

చేవెళ్ల

చేవెళ్ల సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మరోసారి బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే..2014లో కాంగ్రెస్ నుంచి గెలిచిన యాదయ్య ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి విజయం సాధించాడు. ఈసారి యాదయ్యకు కాకుండా తనకే వస్తుందని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆశించగా.. నిరాశే ఎదురైంది. దీంతో ఆయన బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి షాబాద్ మండలానికి చెందిన  పామెన భీం భరత్​ను కాంగ్రెస్  అభ్యర్థిగా బరిలోకి దింపింది. బీజేపీ నుంచి ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. కంచర్ల ప్రకాశ్​, వరి తులసిరాం, కేఎస్ రత్నం పోటీకి ఆసక్తి చూపుతున్నారు.  

రాజేంద్ర నగర్ 

రాజేంద్రనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకాష్ గౌడ్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ ఖరారయ్యారు. బీజేపీ నుంచి కార్పొరేటర్  తోకల శ్రీనివాస్ రెడ్డి, మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. 

ఇబ్రహీంపట్నం 

ఇబ్రహీంపట్నం స్థానానికి సంబంధించి బీఆర్ఎస్ టికెట్​ను సిట్టింగ్ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికే అధిష్టానం కేటాయించింది. మాజీ ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. బీజేపీ నుంచి నోముల దయానంద్​కు టికెట్ దక్కింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య  పోటీ చేస్తారని అనుకున్నా ఆయన వెనకడుగు వేయడంతో బీజేపీ అధిష్టానం దయానంద్​కు టికెట్ ఇచ్చింది.

ఎల్​బీనగర్

2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి ఎల్​బీనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.. ఆ తర్వాత కొద్దిరోజుల్లో బీఆర్ఎస్​లో చేరారు. బీఆర్ఎస్ అధిష్టానం ఈసారి ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో సుధీర్ రెడ్డి  క్యాడర్​తో కలిసి ఆత్మీయ సమ్మేళనాలతో కుల సంఘాలకు, కాలసీ కాలనీ అసోసియేషన్లతో కలిసి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్​ రెడ్డి రాంరెడ్డి టికెట్ ఆశించగా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్​నే అధిష్టానం బరిలోకి దింపింది. రేవంత్ సమక్షంలో బీఆర్ఎస్  నియోజకవర్గ ఇన్​చార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కాంగ్రెస్​లో చేరినా టికెట్ మాత్రం దక్కలేదు. 

శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీకి బీఆర్ ఎస్ అధిష్టానం మరోసారి టికెట్ కేటాయించింది. మరోవైపు మాదాపూర్, హఫీజ్​పేట్ కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. కాంగ్రెస్ నుంచి జగదీశ్వర్ గౌడ్​కు టికెట్​ను రెండో లిస్ట్ లో ప్రకటించారు . ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన భంగపడిన కాంగ్రెస్ నేత రఘునాథ్ ఆయన పార్టీకి పనిచేస్తారో లేదో చూడాలి.  బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యోగానంద్ టికెట్ ఆశిస్తుండగా రవికుమార్ యాదవ్ కూడా ఆశిస్తున్నాడు. 

షాద్ నగర్ 

షాద్ నగర్ నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి మూడోసారి అంజయ్య యాదవ్  బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్​లో చేరి ఈసారి టికెట్ దక్కించుకున్నారు. 

మహేశ్వరం 

మహేశ్వరం నుంచి మంత్రి సబిత పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుంచి కేఎల్ఆర్ బరిలోకి దిగారు. దీంతో 23 ఏళ్ల తర్వాత వీరి మధ్య పోటీ నెలకొంది. ఉమ్మడి ఏపీలో చేవెళ్ల జనరల్​​ స్థానంగా ఉన్నప్పుడు 2000వ సంవత్సరంలో వీరు పోటీ చేశారు. 2009లో అది ఎస్సీ రిజర్వ్​డ్ ​కావడంతో  2009 నుంచి సబిత మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్నారు. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆమె బీఆర్ఎస్​లో చేరి మంత్రి పదవి పొందారు. బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్​లో చేరి ఈసారి టికెట్ ఆశించారు. కానీ మంత్రిని ఓడించాలంటే బలమైన అభ్యర్థి అవసరమని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్​కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కొత్త మనోహర్ రెడ్డి ఇండిపెండెంట్​గా పోటీ చేయనున్నారు..