ఒకే జిల్లాలో వరుస అత్యాచారాలు.. 20 రోజుల్లో ముగ్గురు మైనర్లపై..

ఒకే జిల్లాలో వరుస అత్యాచారాలు.. 20 రోజుల్లో ముగ్గురు మైనర్లపై..

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. లఖింపూర్ ఖేరిలో మూడేళ్ల బాలికను అత్యాచారం చేసి, హత్య చేశారు. ఇదే జిల్లాలో గత 20 రోజుల వ్యవధిలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం జరగడం గమనార్హం. తాజాగా ఓ మూడేళ్ల బాలిక బుధవారం నుంచి కనిపించకుండా పోయింది. ఆ బాలిక గురువారం ఉదయం ఇంటికి అర కిలోమీటరు దూరంలో శవమై కనిపించింది. బాలిక ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక తండ్రి ఫిర్యాదుతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోస్టుమార్టం ద్వారా వెల్లడైందని పోలీసులు తెలిపారు.

పాత కక్షలతోనే తన కూతురుని అత్యాచారం చేసి చంపారని బాలిక తండ్రి ఆరోపించారు. పక్క గ్రామానికి చెందిన లేఖ్రామ్ అనే వ్యక్తి మీద ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి నిందితుడి కోసం నాలుగు బృందాల ద్వారా గాలింపు చేస్తున్నట్లు జిల్లా పోలీసు చీఫ్ సతేంద్ర కుమార్ తెలిపారు.

పది రోజుల కిందట స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఇంటి నుంచి వెళ్లిన 17 ఏళ్ల బాలికపై ఇదే జిల్లాలో హత్యాచారం జరిగింది. ఆమె శరీరం గ్రామానికి 200 మీటర్ల దూరంలో ఉన్న చెరువు సమీపంలో కనుగొనబడింది. అంతకుముందు 13 ఏళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. బాలిక మధ్యాహ్నం సమయంలో పొలానికి వెళ్లగా.. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హత్యచేశారు. బాలిక మృతదేహం రెండు రోజుల తర్వాత సమీపంలోని చెరుకు తోటలో లభించింది.

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ మరియు సమాజ్ వాదీ పార్టీలు ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ‘వరుస అత్యాచారాలు జరుగుతున్నా కూడా మా ‘కఠినమైన’ ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మా సీఎం ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి’ అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లాలు ట్వీట్ చేశారు.

మహిళలపై, ముఖ్యంగా మైనర్లపై నేరాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక సీనియర్ పోలీసు అధికారి నేతృత్వంలో మహిళా మరియు పిల్లల భద్రతా సంస్థను ఏర్పాటు చేసింది.

For More News..

దేశంలో రెండోసారి 83 వేలు దాటిన కరోనా కేసులు

రియా చక్రవర్తి ఇంట్లో యాంటీ డ్రగ్ అధికారుల సోదాలు

తెలంగాణలో మరో 2,478 కరోనా కేసులు