కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు రాక ఇబ్బందులు

కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు రాక ఇబ్బందులు

హైదరాబాద్, వెలుగు: సర్కారు కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లకు 4 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సర్కారు డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 4,500 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తుండగా, వీరికి ఏప్రిల్, మే, జూన్, జులై నెలలకు సంబంధించిన జీతాలను ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయని, పండుగలకు సొంతూళ్లకూ వెళ్లలేక అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే హాస్పిటల్స్‌‌‌‌కు తీసుకెళ్లేందుకు కూడా ఆలోచించాల్సి వస్తుందన్నారు.

నెల నెలా జీతాలు రాక.. ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఫెనాల్టీలు కట్టాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇంటి రెంట్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. చాలామంది అప్పులు చేసి, వాటిని తిరిగి చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. డిగ్రీ, జూనియర్ లెక్చరర్ల జీతాలకు ఫైనాన్స్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బీఆర్‌‌‌‌‌‌‌‌వో రిలీజ్ చేసింది. అయితే, వీరి కొలువులను సర్కారు రెన్యువల్ చేయలేదు. దీంతో జీతాలు ఇవ్వలేకపోతున్నట్టు ఆఫీసర్లు చెప్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి, ఇలా జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రమణ, కొప్పిశెట్టి సురేశ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లనూ రెన్యువల్ చేయాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి దార్ల భాస్కర్ డిమాండ్ చేశారు. రెండ్రోజుల్లో ఈ డేటా హయ్యర్ ఎడ్యుకేషన్‌‌‌‌కు పంపించకపోతే ఇంటర్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు.