భూపాలపల్లి కేటీకే ఓసీపీ-2 లో ప్రమాదం..గ్రేడర్‌‌ ఢీకొని సూపర్‌‌వైజర్‌‌ మృతి

భూపాలపల్లి కేటీకే ఓసీపీ-2 లో ప్రమాదం..గ్రేడర్‌‌ ఢీకొని సూపర్‌‌వైజర్‌‌ మృతి

భూపాలపల్లి రూరల్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటికే ఓసీపీ-2లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్‌‌ సూపర్‌‌వైజర్‌‌ చనిపోయాడు. వివరాలకు వెళ్తే... ఎస్‌‌వీఈసీ కంపెనీలో కాంట్రాక్ట్‌‌ సూపర్‌‌వైజర్‌‌గా పనిచేస్తున్న శ్రీహరి (47) డ్యూటీలో భాగంగా శనివారం రాత్రి ఓసీపీలోని డంపింగ్‌‌ యార్డ్‌‌ వద్ద పనులు పర్యవేక్షిస్తున్నాడు. 

అర్ధరాత్రి 1.45 గంటల సమయంలో గ్రేడర్‌‌ వాహనం ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన తోటి కార్మికులు ఆఫీసర్లకు సమాచారం ఇవ్వగా వెంటనే సింగరేణి భూపాలపల్లి ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. శ్రీహరిని పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి పోలీసులు తెలిపారు.