కాంట్రాక్టర్లు వస్తలేరు.. నిలిచిపోయిన రూ. వంద కోట్ల పనులు

కాంట్రాక్టర్లు వస్తలేరు.. నిలిచిపోయిన రూ. వంద కోట్ల పనులు
  •     టెండర్ల రీకాల్ కు స్పందన కరువు
  •      ఈఎన్సీ సముదాయించినా పట్టింపు లేదు
  •     నిధుల కొరతతోనే అసలు సమస్య...

నిర్మల్, వెలుగు:  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన రోడ్లు, వంతెనలు ఇతర మరమ్మత్తుల పనుల కు  ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు.   ఇప్పటివరకు ఆరేడు  టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ ఒక కాంట్రాక్టర్ కూడా ఈ టెండర్లలో పాల్గొనడం లేదు.   ఎప్పటి కప్పు డు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు జంకుతున్నా రంటున్నారు ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో దాదాపు రూ. వంద కోట్లకు  పైగా వివిధ రకాల పనులు చేపట్టాల్సి ఉంది. గతంలో చేసిన పనులకే బిల్లులు రాలేదని, ఈ పనులు ఎలా తీసుకోవాలని పలువురు అంటున్నారు.    ఈ పనులు  వేసవి కాలంలోగానే పూర్తి కావాల్సి ఉండడంతో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి అధికారులు ఎలాగైనా ఈ పనులను పూర్తి చేసేందుకు తంటా లు పడుతున్నారు.  గుత్తేదారులు ముందుకు రాక పోవడంతో ఏకంగా ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ లాంటి ఉన్నత స్థాయి అధికారులను సైతం రంగంలోకి దింపి వారి చేత కూడా కాంట్రాక్టర్లకు ను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు.

ఆర్ అండ్ బీ  ఆధ్వర్యంలో...

జిల్లావ్యాప్తంగా  ఆర్ అండ్ బి శాఖకు రెన్యువల్స్ కింద 19 పనుల కోసం రూ. 50 కోట్ల   మంజూరయ్యాయి. ఈ పనుల కోసం మొదటి దఫా టెండర్లు  పిలవగా ఒక్క కాంట్రాక్టర్ కూడా టెండర్ దాఖలు చేయలేదు. అయితే అధికారులు రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో చర్చించి బలవంతంగా 19 పనులకు గాను 17 పనులకు టెండర్లను దాఖలు చేయించారు.   ఈ 17 పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇప్పటివరకు అగ్రిమెంట్ చేసుకోకుండా జాప్యం చేస్తున్నారు. అధికా రులు ఒత్తిడి తేవడంతో తమ వద్ద ఈఎండీ కట్టేందుకు డబ్బులు లేవని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   మరో రెండు నెలల లోగా ఈ పనులు పూర్తి చేయనట్లయితే మరమ్మతులు లేక ఆర్ అండ్ బి పరిధిలోని రోడ్లు, వంతెనలు మరింత అద్వానంగా మారే పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. 

ఫలితం కనిపించలే..

గత నాలుగు రోజుల క్రితం పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సంజీ వరావు నిర్మల్ లోనే రెండు రోజులు మకాం వేసి కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు. పనులు చేపట్టాలని బిల్లులు వెంటనే విడుదలయ్యేట్లు చూస్తానని హామీని ఇచ్చారు. అయినప్పటికీ మొదట తమకు పాత పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరారు. ఇప్పటి వరకు ఈఎన్సీ  హామీ ఇచ్చినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం టెండర్లు దాఖలు చేసేందుకు ముందుకు రాలేదు

కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు...

ఎం ఆర్ ఆర్, ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ల పనుల కోసం టెండర్లు ఆహ్వానించినప్పటికీ ఏ ఒక్క కాంట్రాక్టర్ పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పటివరకు ఐదు సార్లు టెండర్ లు వాయిదా వేసాం. అయినప్పటికీ కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయకుండా వెనుకాడుతు న్నారు.   పలుసార్లు కాంట్రాక్టర్ల తో చర్చించాం. అయినా ఫలితం లేదు. ఈఎన్సీ స్థాయి అధికారి కూడా కాంట్రాక్టర్లకు నచ్చ చెప్పారు.  - శంకరయ్య, ఈఈ, పంచాయతీరాజ్ శాఖ,నిర్మల్.

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఎం ఆర్ ఆర్, ఫ్లడ్ డ్యామేజీ రిపేర్స్ పనులు చేపట్టేందుకు 64 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. మొ త్తం 50 పనులకు గాను అధికారులు ఇప్పటికే ఆరేడు సార్లు టెండర్లు పిలిచినా ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ఈ పనులను చేపట్టేందుకు టెండర్ దాఖలు చేయలేదు. సంబంధిత కాంట్రాక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ఈ ఈ,  డీ ఈలు పలుసార్లు చర్చించి టెండర్ దాఖలు చేయాలని కోరా రు. అయినప్పటికీ గతంలో చేసిన పనుల కు సంబంధించిన బిల్లులు రాలేదని తాము పనులు ఎలా చేయాలంటూ వారు అధికారులను ఎదురు ప్రశ్నిస్తున్నారు. దీంతో అధికారులు ఈ 50 పనులను ఎలా పూర్తి చేయాలన్న సందిగ్ధంలో ఉన్నారు.