
‘నలుగురిలో ఉన్నప్పుడు మాటను.. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను.. కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు’ అని చెప్తోంది భగవద్గీత.
అందుకే కాలు జారితే తీసుకోవచ్చు. కానీ... నోరు జారితే వెనక్కు తీసుకోలేం అంటారు. శరీరానికి తగిలిన గాయం మానుతుంది. కానీ... మనసుకు తగిలిన గాయం మానదు అంటారు. మనసుకు అయ్యే గాయం మాటల వల్లే. అందుకే నోరు జారకూడదు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు చాలామంది నోరు అదుపు తప్పి మాట్లాడతారు. ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండానే ఒక్కోసారి దురాలోచనలు వస్తుంటాయి. కొందరిలో వారి ప్రమేయంతోనే దురాలోచనలు చీమల బారుల్లా పుడుతూనే ఉంటాయి. రామాయణంలో మంధర ఇందుకు మంచి ఉదాహరణ.
ఆమె మెదడులో నిత్యం దురాలోచనలు పుడుతూనే ఉంటాయి. ఆ దురాలోచనలతోనే పబ్బం గడుపుకుంటుంది మంధర. అలా పుట్టిన ఆలోచనలను కైకేయికి విషంలా నూరిపోసింది. వాస్తవానికి రాముడిని కౌసల్య కంటె కైకేయి ఎక్కువ ప్రేమతో ఎత్తుకుని పెంచింది. రాముడి మీద మాట పడనిచ్చేది కాదు. కానీ, మంధర పలికిన తేనె పూసిన కత్తిలాంటి మాటలకు కైకేయి మనసు విషంతో నిండిపోయింది. దశరథుడి దగ్గర నోరు జారింది. తన సదాలోచనలను అదుపులో ఉంచుకోలేకపోయింది. అందుకు ఫలితం అనుభవించింది. రాముడు అడవుల పాలయ్యాడు. కానీ, భరతుడు రాజు కాలేదు. అంతేనా దశరథుడి మరణానికి కారణమైంది. ఆమె మాట, దురాలోచనల కారణంగానే ఇంత నష్టమూ జరిగింది.
ఇక రావణుడు
నిండు సభలో గౌరవమర్యాదలతో మాట్లాడకుండా, నోటిని అదుపులో ఉంచుకోకుండా, యధేచ్ఛగా మాట్లాడేవాడు. నలుగురిలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని విభీషణుడు హితబోధ చేసినప్పటికీ రావణుడు పెడచెవిన పెట్టాడు. సీతాదేవిని తిరిగి రాముడికి అప్పగించమని విభీషణుడు మంచి ఆలోచన చెప్పినప్పటికీ, రావణుడిలో ఉన్న దురాలోచనలు రావణుడి నాశనానికి కారణమయ్యాయి. రాముడితో జరిగిన యుద్ధంలో సోదరులను, పుత్రులను, బంధువులను అందరినీ కోల్పోయాడు. లంకా నాశనానికి కారకుడయ్యాడు.
భారతంలో చూస్తే...
శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు... ఈ నలుగురినీ కలిపి దుష్టచతుష్టయం అంటారు. ఈ నలుగురూ కలిసినప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు దురాలోచనలు చేయటంతోనే వారికి ఆ పేరు వచ్చింది. కర్ణుని వంటి యోధుడు ఒంటరిగా ఉన్న సమయంలో సదాలోచనలు చేసి ఉంటే చరిత్రలో మేధావిగా నిలిచిపోయేవాడు. కేవలం స్నేహం కోసమే నిరంతరం దురాలోచనలు చేస్తూనే ఉండేవాడు. ఇక దుర్యోధనుడి విషయానికి వస్తే, శ్రీకృష్ణ రాయబార సమయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడి, అందరి వ్యతిరేకతకు గురయ్యాడు. ధృతరాష్ట్రుడు సైతం ఒంటరిగా ఉన్నప్పుడు దురాలోచనలకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. అందువల్లే వంద మంది సంతానం ఉన్నప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో ఒక్కరు కూడా మిగల్లేదు.
రామాయణంలో రాముడు, భారతంలో పాండవులు, విదురుడు... వీరంతా ఆలోచనలను అదుపులో ఉంచుకున్నారు. శ్రీరాముడికి పట్టాభిషేకం నిర్ణయించాడు దశరథుడు. ఆ విషయం రాముడికి చెప్పాడు. రాముడు తండ్రి మాటను శిరసావహించాడు. తన ఆలోచనలను పూర్తిగా అదుపులో ఉంచుకున్నాడు. అంతలోనే కైక కోరిన వరాల కారణంగా రాముడిని అడవులకు వెళ్లమన్నారు. ఆ మాటలను కూడా శిరసావహించాడు. తండ్రిని కానీ, తల్లిని కానీ దూషించలేదు. నిందించలేదు. అంత స్థితప్రజ్ఞతతో ఆలోచన చేసే సుగుణాభిరాముడు శ్రీరాముడు. పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం పూర్తయ్యాక, పట్టాభిషిక్తుడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డలుగా పాలించాడు. ‘రామరాజ్యం’ అనే పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా పాలించాడు. అదీ సదాలోచనల వల్ల కలిగే ఫలితం.
భారతానికి వస్తే...
పాండవులు ధర్మానికి కట్టుబడిన ఆలోచనలే చేసేవారు. జూదక్రీడలో ఓడిపోయి అరణ్యాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు, ఒక్కరిని కూడా నిందించలేదు. నోటిని అదుపులో ఉంచుకున్నారు. పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని, తిరిగి వచ్చి తమ రాజ్యం తమకు ఇవ్వవలసిందిగా కోరారు. దుర్యోధనుడు నిరాకరించాడు. అప్పుడు కూడా నోటిని అదుపులోనే ఉంచుకున్నారు. ధర్మబద్ధంగా యుద్ధం చేశారు. రాజ్యం పరిపాలించారు. ధర్మరాజు పరిపాలన అంటే ధర్మానికి మారుపేరుగా నిలిచాడు. అక్కడ రాముడు, ఇక్కడ ధర్మరాజు ఇద్దరూ మేధావులుగా చరిత్రలో నిలిచిపోయారు. మనిషిలో రెండు రకాల స్వభావాలు ఉంటాయి. ఒక స్వభావం ప్రకారం మంచి ఆలోచనలు కలుగుతాయి. ఒక స్వభావం ప్రకారం చెడు ఆలోచనలు వస్తుంటాయి. చెడు ఆలోచనలను పక్కకు తోసి, మంచి ఆలోచనలను చేయటం వల్ల మనిషి మేధావి అనిపించుకుంటాడని మన పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి.
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232