లేని పోస్టుకు బాధ్యతలు ..తప్పుల తడకగా సర్కారీ జీవో

లేని పోస్టుకు బాధ్యతలు ..తప్పుల తడకగా సర్కారీ జీవో

 

  • ఆసిఫాబాద్ కు డీఐఈఓ పోస్టు లేకున్నా ఆర్డర్ 
  • డీపీసీ లేకుండానే ప్రిన్సిపల్ ప్రమోషన్! 

హైదరాబాద్: విద్యాశాఖ ఇటీవల రిలీజ్ చేసిన ఓ జీవో ఇంటర్మీడియేట్​ఎడ్యుకేషన్​లో వివాదాస్పదంగా మారింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో లేని డీఐఈఓ పోస్టుకు ప్రిన్సిపల్​కు బాధ్యతలు ఇవ్వగా.. డీపీసీ లేకుండానే ఓ లెక్చరర్​కు ప్రిన్సిపల్ ప్రమోషన్ ఇచ్చారు. ఇటీవల విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ ఇచ్చిన జీవో నెంబర్ 150 తప్పులతడకగా మారింది. రాష్ట్రంలో11 జిల్లాలకు మాత్రమే డీఐఈఓ ( జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి)లు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన చాలా జిల్లాలకు కాలేజీల పర్యవేక్షణకు సీనియర్ ప్రిన్సిపల్స్ ను నోడల్ ఆఫీసర్లను నియమించారు. అయితే, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు నోడల్ ఆఫీసర్ గా ఉన్న శ్రీధర్ సుమన్​ను బదిలీ చేస్తూ, రెబ్బన సర్కారు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్​శంకర్​కు డీఐఈఓగా పోస్టింగ్ ఇస్తూ వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. 

అయితే, ఆ జిల్లాకు డీఐఈఓ పోస్టు లేదు. ప్రస్తుతమున్న నోడల్ ఆఫీసర్​ను ట్రాన్స్​ ఫర్ ఎక్కడికి చేశారనేది ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. మరోపక్క కౌటాల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ స్వరూపరాణిని బదిలీ చేశారు. ఆమె రెగ్యులర్ ప్రిన్సిపల్ కానీ, ఆమెను ఎక్కడికి ట్రాన్స్​ఫర్ చేస్తున్నరనేది జీవోలో చెప్పలేదు. దీనికి ఆమె స్థానంలో డీపీసీ లేకుండా ఆ కాలేజీ లెక్చరర్ బాలకిషన్​కు ప్రిన్సిపల్​గా పోస్టింగ్ ఇచ్చారు. అయితే, ఉత్తర్వుల్లోసీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ అని పేర్కొనాల్సిన చోట... సీనియర్ లెక్చరర్ అని పేర్కొన్నారు. వాస్తవానికి సీనియర్ లెక్చరర్ అంటే డిగ్రీ లెక్చరర్. ఇలా అనేక తప్పులతో జీవో రావడంపై ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్​లో చర్చనీయాంశంగా మారింది.