దగ్గు మందుపై వివాదం.. ప్రిస్క్రిప్షన్పై ఇకపై డాక్టర్లు అలా రాయొద్దని సుప్రీం ఆదేశాలు

దగ్గు మందుపై వివాదం.. ప్రిస్క్రిప్షన్పై ఇకపై డాక్టర్లు అలా రాయొద్దని సుప్రీం ఆదేశాలు
  • ప్రజారోగ్యంపై ఔషధ మాఫియా పంజా.. 

రాష్ట్రంలో ఆరోగ్యం అనేది పౌరుల ప్రాథమిక హక్కుగా కాకుండా, కొందరి అడ్డగోలు వ్యాపారానికి, లాభాలార్జనకు వేదికగా మారింది. ఔషధాల ఉత్పత్తికి 'ఫార్మా హబ్'గా ప్రపంచస్థాయిలో పేరుగాంచిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో, ఆసుపత్రి ప్రాంగణాల నుంచి తయారీ కేంద్రాల వరకు ఒక వ్యవస్థీకృత ‘ఫార్మా కంపెనీల అడ్డగోలు మార్కెటింగ్ పద్ధతులు’ రాజ్యమేలుతున్నాయి. వైద్యం పట్ల ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని, ఆశను ఆసరాగా చేసుకొని ఈ అడ్డగోలు మార్కెటింగ్ కేవలం డబ్బును దండుకోవడమే కాక, ప్రజల ప్రాణాలతోనూ అత్యంత నిర్లక్ష్యంగా చెలగాటం ఆడుతోంది. ఈ అనైతిక కార్యకలాపాలు రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

ఇటీవలి పరిణామాలు ఈ వ్యవస్థ నియంత్రణ ఎంత నిర్వీర్యమైందో నిరూపిస్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లలో విషతుల్యమైన డైథైలిన్ గ్లైకాల్ (DEG) కలుషితమైన ‘కోల్డ్‌‌‌‌‌‌‌‌రిఫ్’ దగ్గు సిరప్ సేవించి చిన్నారులు మరణించిన ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ విషాదం నేపథ్యంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) వెంటనే 'Stop Use Notice' జారీ చేయాల్సి వచ్చింది. ఈ కలుషితమైన ఔషధం రాష్ట్రంలోకి సరఫరా కావడం, దానిపై అదుపు లేకపోవడం మందుల నియంత్రణ వ్యవస్థ పటిష్టతపై తీవ్రమైన ప్రశ్నలు వేస్తోంది. 

ఒకవైపు ప్రాణాలను తీసే నాసిరకం మందుల నాణ్యత ప్రశ్నార్థకమవుతుండగా, మరోవైపు  ఓ రసాయన కర్మాగారంలో ఏకంగా వేల కోట్లకు పైగా విలువైన ఎండీ (మెఫెడ్రోన్) డ్రగ్స్ తయారుచేస్తున్న రాకెట్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు పట్టుకోవడం, ఆ తరువాత ఒక పాఠశాల నుంచే నిషేధిత ఆల్ప్రజోలామ్ తయారీ కేంద్రాన్ని ఈగల్ టీం వెలికితీయడం వంటి ఘటనలు రాష్ట్రంలో ఔషధ తయారీ, నియంత్రణ ఎంతటి నిరాశజనకమైన స్థితిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి. ఇవి కేవలం చట్టవిరుద్ధ కార్యకలాపాలు కాదు ప్రజారోగ్యానికి పెట్టిన అగ్ని పరీక్షగా, ప్రభుత్వ నిఘా యంత్రాంగాల వైఫల్యంగా  చూడాలి.

హాస్పిటల్-డాక్టర్-ఫార్మసీ బంధం

తెలంగాణలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణాల్లో, ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు మెడికల్ షాపులు ఏటా కోట్లలో వ్యాపారం చేస్తున్నాయంటే, దీని వెనుక ఉన్న అడ్డగోలు మార్కెటింగ్ ఎంతటి ‘బలమైందో అర్థమవుతుంది. పేదలకు ఉచిత మందులు అందించాల్సిన ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో సైతం, ఉచిత ఫార్మసీలో కీలకమైన ఔషధాలను కృత్రిమంగా కొరత సృష్టించడం పరిపాటిగా మారింది. రోగి తప్పనిసరిగా ఆసుపత్రి ప్రాంగణంలోని లేదా సమీపంలోని ప్రైవేటు షాపుల్లోనే కొనాల్సి వస్తుంది. 

ఎందుకంటే, వైద్యులు సూచించిన ఆ ప్రత్యేకమైన బ్రాండెడ్ మందులు ఆ ప్రైవేటు షాపుల్లో మాత్రమే లభిస్తాయి. వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌లకు ప్రతిగా ఆయా దుకాణాల నుంచి కమీషన్లు ముడుతున్నట్లు బలమైన విమర్శలు ఉన్నాయి. ఈ లాభాపేక్ష కారణంగానే, వైద్యులు తమ ధర్మంగా తక్కువ ధరకు లభించే జనరిక్ ఔషధాలను రాయడానికి ఇష్టపడకుండా, అధిక ధర పలికే పేటెంట్ బ్రాండెడ్ ఔషధాలను మాత్రమే సూచిస్తున్నారు.  దీంతో, రోగికి అస్వస్థత ఒక బాధైతే, ఆర్థిక దోపిడీ మరో పెద్ద దెబ్బగా, వైద్య ఖర్చులకు చితికిపోయే దుస్థితిగా మారుతోంది.

రోగి హక్కుల ఉల్లంఘన

ప్రైవేట్ ఆసుపత్రులలో ఫార్మా మాయ శక్తి  పరోక్షంగా అమలు చేస్తున్న మరో ముఖ్యమైన ట్రిక్ వైద్యులు చేతి రాతతో రాసే అస్పష్టమైన ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌లు (Unreadable Prescriptions). ఇది కేవలం వైద్యుల నిర్లక్ష్యం మాత్రమే కాదు, ఆ మందులు బయటి ఫార్మసీలో దొరకకుండా, కేవలం తమ హాస్పిటల్ ఫార్మసీలో  మాత్రమే కొనుగోలు చేయాలనే కుట్రలో భాగమనే వాదనకు బలం చేకూర్చుతుంది. 

ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌ను చదవలేక బయటి ఫార్మసీలు మందులు ఇవ్వడానికి నిరాకరిస్తే, రోగికి తమ ఆసుపత్రి ఫార్మసీ తప్ప మరో దారి ఉండదు. ఈ విధంగా, రోగి ఔషధ కొనుగోలు హక్కును, ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరించి వేయడంలో ఈ అదృశ్య శక్తి విజయం సాధిస్తోంది. ప్రజారోగ్య కార్యకర్తలు , పౌరులు ఈ దోపిడీపై వ్యక్తం చేస్తున్న ఆందోళనలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా, మానవతా దృక్పథంతో పరిగణించాలి.

ఔషధ కొనుగోలు హక్కు 

వైద్యులు ఇకపై బ్రాండెడ్ పేర్లను కాకుండా, వాటిలోని రసాయన నామం (Generic Name) ఆధారంగా జనరిక్ మందులనే తప్పనిసరిగా సూచించాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సందీప్ మెహతా, ‘ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే, ఔషధ రంగంలో ఉన్న అక్రమాలను అరికట్టి, అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది’ అని అభిప్రాయపడ్డారు. ఫార్మా కంపెనీల అడ్డగోలు మార్కెటింగ్ పద్ధతులు, వాటి ప్రభావం వల్ల సామాన్యులు అధిక ధరలకు మందులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 

ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు చవకైన వైద్యం అందించడంలో కీలక మలుపు కానుంది.  డాక్టర్లు కంప్యూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, అర్థం కాని విధంగా రాతలు కొనసాగిస్తుండడంపై పంజాబ్, హర్యానా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి డిజిటల్ ప్రిస్క్రిప్షన్ వ్యవస్థ  అందుబాటులోకి వచ్చేంతవరకు, వైద్యులు తమ ప్రిస్క్రిప్షన్లను స్పష్టంగా, పెద్ద అక్షరాలతో  మాత్రమే రాయాలని హైకోర్టు ఆదేశించింది. అస్పష్టమైన రాతల కారణంగా ఔషధాల విషయంలో తప్పులు జరిగే ప్రమాదం ఉందని, ఇది రోగి ప్రాణాలకే ముప్పు తెస్తుందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదేశాన్ని జారీ చేసింది.

ప్రభుత్వ తక్షణ కర్తవ్యం 

తెలంగాణ ప్రభుత్వం తక్షణమే విధానపరమైన సంస్కరణలు చేపట్టాలి. ఇది కేవలం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA)కు సంబంధించిన సమస్య మాత్రమే కాదు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సంబంధించిన అత్యవసర పరిస్థితి. మొట్టమొదటి చర్యగా, వైద్యులు చేతిరాతతో కాకుండా, కంప్యూటర్ ద్వారా ముద్రించిన, స్పష్టమైన ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌లను మాత్రమే ఇవ్వడాన్ని తక్షణమే తప్పనిసరి చేయాలి. ఈ డిజిటల్ ప్రిస్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌లో కచ్చితంగా ఔషధాల జనరిక్ పేర్లను మాత్రమే పేర్కొనాలి, తద్వారా రోగికి తక్కువ ధరలో మందులు కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. 

అదేవిధంగా, ఆసుపత్రిలోని వైద్యులు, తమ ఆసుపత్రి ఫార్మసీ నుంచే మందులు కొనాలని రోగిని చట్టవిరుద్ధంగా బలవంతం చేయడాన్ని నిషేధించాలి. రోగికి నచ్చిన చోట, తక్కువ ధరకు మందులు కొనుగోలు చేసే హక్కుపై ప్రభుత్వం హామీ ఇవ్వాలి. ఇక నియంత్రణ సంస్థల విషయానికి వస్తే, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్​తో పాటు ఇతర విభాగాలకు తగినంత మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, రాజకీయ జోక్యం లేని స్వయంప్రతిపత్తిని ఇవ్వాలి. 

పౌరుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కొందరు స్వార్థపరులు దోచుకుపోతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం సరికాదు. కేవలం ప్రకటనలు, హెచ్చరికలు సరిపోవు. ప్రజలకు నాణ్యమైన, సరసమైన వైద్య సదుపాయం, కచ్చితమైన ఔషధాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే కఠినమైన విధానాలను, పటిష్టమైన నియంత్రణ వ్యవస్థను అమలు చేయాలి. 

- డా.కట్కూరి,
సైబర్ సెక్యూరిటీ, న్యాయ నిపుణుడు