టీఆర్ఎస్​అధ్యక్ష ఎన్నికపై గొడవ

టీఆర్ఎస్​అధ్యక్ష ఎన్నికపై గొడవ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలానికి చెందిన 8 మంది టీఆర్ఎస్​ సర్పంచ్​లు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గతేడాది తుర్కపల్లి మండలం టీఆర్ఎస్​అధ్యక్ష ఎన్నికపై గొడవ జరిగింది. డీసీసీబీ చైర్మన్​ గొంగిడి మహేందర్​రెడ్డి కారుపై కొందరు రాళ్లు విసిరారు. ఇందుకు ఆలేరు మార్కెట్​కమిటీ మాజీ చైర్మన్​పడాల శ్రీనివాస్​ కారణమంటూ ఆయనను పార్టీ నుంచి ఎమ్మెల్యే సునీత బైకాట్​చేశారు. బహిష్కరణ ఎత్తివేయాలని మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డిని పడాల కలిసి హామీ పొందారు. ఇది జరిగి ఏడాదైనా బహిష్కరణ ఎత్తివేయకపోవడంతో రాజకీయ భవిష్యత్​ కోసం పడాల శ్రీనివాస్​ బీజేపీ వైపు దృష్టి సారించారు. ఆ పార్టీ సంస్థాగత నాయకులతో పాటు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్​ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డితో మాట్లాడారు.

శుక్రవారం దాదాపు 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్​కు రాజీనామా చేయగా పడాల శ్రీనివాస్​ఆధ్వర్యంలో శనివారం 8 మంది సర్పంచులు, మరో పది మంది లీడర్లు ఈటల రాజేందర్​సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచులు జక్కుల శ్రీవాణి, పడాల వనిత, మాలోత్ లలిత, గుగులోత్ జ్యోతి, వంకరి లావణ్య, నునావత్ లలిత, మాలోత్ రమేష్ నాయక్, మలోత్ మంగ్య నాయక్ బీజేపీలో చేరగా ఇదే మండలానికి చెందిన మరో 8 మంది సర్పంచులు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. ఆలేరు మార్కెట్​ కమిటీ మాజీ చైర్మన్​ పడాల శ్రీనివాస్​ సైతం ఆదివారం మునుగోడు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్​షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.