హైదరాబాద్ లాల్ దర్వాజా .. మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపుపై గందరగోళం

హైదరాబాద్ లాల్ దర్వాజా .. మహంకాళి అమ్మవారి హుండీ లెక్కింపుపై గందరగోళం
  • హుండీలు ఓపెన్​ చేసిన ఆలయ కమిటీ
  • తమకు చెప్పకుండానే తెరిచారన్న ఎండోమెంట్​ అధికారులు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపుపై గందరగోళం నెలకొంది. ఏటా బోనాల సందర్భంగా ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లిస్తారు. ప్రత్యేక పూజలు చేసి కానుకలు సమర్పిస్తుంటారు. బోనాల ఉత్సవం ముగిసిన తర్వాత ఎండోమెంట్, ఆలయ కమిటీ సభ్యులు హుండీలు లెక్కించడం ఆనవాయితీగా వస్తున్నది.  వచ్చిన కానుకలను ఎండోమెంట్​ అకౌంట్ లో జమ చేస్తారు. ఈసారి ఆలయ కమిటీకి చెందిన కొందరు సభ్యులు హుండీలు ఓపెన్​ చేశారు. దీంతో కొందరు భక్తులు కోర్టును ఆశ్రయించగా.. హుండీ లెక్కింపుపై ఈ నెల 17న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఎండోమెంట్ అధికారులు మంగళవారం హుండీలు సీజ్​ చేశారు.

 అప్పటికే ఆలయ కమిటీ సభ్యులు మూడు హుండీలు ఓపెన్​ చేసి నిధులు తీసుకున్నారు. రూ.4.20 లక్షలు వచ్చాయని, ఆలయంలో ఏర్పాట్ల కోసం ఖర్చు చేశామని ఆలయ నిర్వాహకులు చెబుతున్నట్లు ఎండోమెంట్​ అధికారులు తెలిపారు. ఆలయంలో మొత్తం నాలుగు హుండీలు ఉన్నాయని, అందులో మూడు తెరిచారని పేర్కొన్నారు. మిగిలిన హుండీని సీజ్​ చేశామన్నారు. బుధవారం ఆ హుండీ లెక్కిస్తామన్నారు. నిరుడు  హుండీల ద్వారా రూ.11 లక్షల ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. కాగా, తమకు తెలియకుండా హుండీ లెక్కింపు జరిగిందని ఎండోమెంట్​ అధికారులు చెబుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.