
నిర్భయ దోషులకు రేపు(ఫిభ్రవరి-1)న అమలు చేయాల్సిన ఉరిశిక్ష వాయిదా పడింది. డెత్ వారెంట్ పై స్టే ఇస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. నిర్భయ దోషులకు మరోసారి ఉరి అమలు వాయిదా పడడంతో నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర భావోద్వేగాలకు లోనై కంటతడి పెట్టారు. ఉదయం నుంచి తమకు న్యాయం జరుగుతుందని ఆశించామని…కానీ మమ్మల్ని మభ్యపెడుతున్నారని చెప్పారు. అంతేకాదు జీవిత కాలం వరకు దోషులకు శిక్షపడదని.. నిందితుల తరఫు లాయర్ ఏపీ సింగ్ తమతో చాలెంజ్ చేసి వెళ్లారని తెలిపారు. ఇది చాలా సిగ్గు చేటన్నారు. కోర్టులు, ప్రభుత్వం కావాలనే దోషులను కాపాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్భయ దోషులు మరోసారి తప్పించుకున్నారన్ననిర్భయ తల్లి…వారికి ఒక్క క్షణం కూడా జీవించే హక్కులేదన్నారు. దోషులకు ఉరిశిక్ష పడేంత వరకు పోరాడుతానని తేల్చి చెప్పారు.