
- రేట్లు ఇంకో 10-15 శాతం పెరుగుతాయని అంచనా
బిజినెస్ డెస్క్, వెలుగు: వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు తగ్గిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో కుకింగ్ ఆయిల్ రేటు సగటున లీటర్‌కు రూ. 200 టచ్ చేసింది. రెండేళ్ల కిందట లీటర్ వంట నూనె రేటు సగటున రూ. 80 పలకగా, ప్రస్తుతం 100 శాతానికి పైగా పెరిగి రికార్డ్ లెవెల్‌కు చేరుకుంది. తాజాగా ఇండోనేషియా పామ్ ఆయిల్ ఎగుమతులపై బ్యాన్ స్టార్టయితే దేశంలో వంట నూనె రేట్లు మరింత పెరుగుతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. పామ్ ఆయిల్‌ను ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే ఇండోనేషియా తమ రిఫైన్డ్ పామ్ ఆయిల్ అయిన ఆర్‌బీడీ పామ్ ఓలైన్ ఎగుమతులపై బ్యాన్ విధించింది. గురువారం నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. దీంతో వంట నూనె రేట్లు షార్ట్ టెర్మ్‌లో మరో 10–15 శాతం పెరుగుతాయని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. దేశంలో ఎక్కువగా వినియోగిస్తున్న వంట నూనెల్లో పామ్ ఆయిల్ ఒకటి. ఇంకా ఈ ఆయిల్‌ను కేక్‌లు, చాక్లెట్‌లు, కాస్మోటిక్స్, సోప్‌లు, షాంపూలు, క్లీనింగ్ ప్రొడక్ట్‌లలో కూడా వాడతారు. ఇండోనేషియా, మలేషియా నుంచే పామ్ ఆయిల్‌ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. ప్రభుత్వ డేటా ప్రకారం, దేశంలో ఏడాదికి 2.25 కోట్ల టన్నుల ఎడిబుల్ ఆయిల్‌ను వినియోగిస్తుండగా, ఇందులో 95 లక్షల టన్నులు లోకల్‌గానే ప్రొడ్యూస్ అవుతోంది. మిగిలిన ఎడిబుల్ ఆయిల్ కోసం దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఇందులో 35 లక్షల నుంచి 40 లక్షల టన్నుల వరకు ఇండోనేషియా నుంచే దిగుమతి అవుతోంది. ఇండోనేసియా తన ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ఎగుమతులపై బ్యాన్ పెడితే ఎక్కువగా నష్టపోయే దేశాల్లో ఇండియా కూడా ఉంటుంది. దీని ప్రభావం వంట నూనె రేట్లపై పడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు.
ప్రభుత్వం చర్చించాలి..
పామ్ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ బ్యాన్‌పై ఇండోనేసియాతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్‌ఈఏ) కోరుతోంది. ఇండోనేషియా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఇండియాపై తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. కాగా, ఇండోనేషియాలో ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఆర్‌బీడీ పామ్ ఓలైన్ ఎగుమతులపై బ్యాన్ విధించింది. ‘పామ్ ఆయిల్ బ్యాన్‌పై ఇండోనేషియా ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరపాలని మన ప్రభుత్వానికి సలహాయిస్తున్నాం. దేశ పామ్ ఆయిల్ దిగుమతుల్లో సగం వాటా ఇండోనేషియా నుంచే వస్తోంది. ఈ వాటాను ఏ ఇతర దేశాలు తీర్చలేవు’ అని ఎస్‌ఈఏ డైరెక్టర్ జనరల్ బీవీ మెహతా అన్నారు. ఈ వార్తతో మలేషియా ఆయిల్ రేట్లు బాగా పెరుగుతాయని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో సన్‌ఫ్లవర్, సోయాబీన్ ఆయిల్ దిగుమతులు సగానికి పైగా తగ్గాయని ఎనలిస్టులు చెబుతున్నారు. అయినప్పటికీ ఇతర రకం వంట నూనెలతో మనం మేనేజ్ చేయగలుగుతున్నామని అన్నారు. అదే ఇండోనేషియా ఆయిల్ బ్యాన్ అమల్లోకి వస్తే దేశ వంట నూనె మార్కెట్‌పై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పారు. కాగా, దేశ ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ పెరగడానికి ప్రధాన కారణం వంట నూనె రేట్లు పెరగడమే.
ఇండోనేషియా బ్యాన్ ఎక్కువ రోజుల పాటు కొనసాగుతుంది అనుకోవడం లేదు. అందువలన మార్కెట్‌లో రేట్లు తగ్గొచ్చు. అయినప్పటికీ అగస్ట్– సెప్టెంబర్ వరకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే నూనె గింజల పంటలను వేయడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపించొచ్చు. దీంతో ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సారి నూనె గింజల ప్రొడక్షన్ పెరుగుతుందని అంచనావేస్తున్నాం.
- సౌగత నియోగి, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సీఈఓ