ఏడు నెలల్లో 70 శాతం పెరిగిన వంటనూనెల రేట్లు..

ఏడు నెలల్లో 70 శాతం పెరిగిన వంటనూనెల రేట్లు..
  • వంటనూనెల మంట
  • ఏడు నెలల్లోనే 50 నుంచి 70 శాతం పెరిగిన రేట్లు
  • సన్‌‌ ఫ్లవర్‌‌ రూ. 165.. పల్లీ నూనె రూ.175
  • 19 కేజీల నూనె వాడుతున్న ఒక్కోమనిషి
  • రాష్ట్రంలో ఏటా 3 లక్షల టన్నుల ఆయిల్‌‌ కొరత
  • మన దగ్గర దిగుబడి లేదు.. బయటి నుంచి దిగుమతి లేదు

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో వంట నూనెలు మస్తు పిరమైనయ్‌‌. ఏడు నెలల్లోనే 50 నుంచి 70 శాతం వరకు పెరిగినయ్‌‌. మన దగ్గర దిగుబడి లేకపోవడం, వేరే దేశాల నుంచి దిగుమతి తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నయ్‌‌. పొద్దు తిరుగుడు నూనె గత ఆగస్టులో లీటర్‌‌ రూ. 102 ఉండగా ఇప్పుడు రూ.165కు పెరిగింది. పామాయిల్‌‌ రూ. 40 పెరిగి రూ. 127కు చేరింది. పల్లీ నూనె రూ. 123 నుంచి రూ. 175కు పెరిగింది. స్వచ్ఛమైన పల్లీ నూనె రూ. 240 వరకు సేల్‌‌ అవుతోంది. రాష్ట్రంలో గతంలో ఎక్కువగా వేరుశనగ నూనెను వాడేవారు. ఇప్పుడు సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌కు డిమాండ్‌ బాగా ఉంటోంది. 45 శాతం ఉండే పల్లి నూనె వాడకం 10 శాతానికి పడిపోయింది. కానీ మన దగ్గర సన్‌ ఫ్లవర్‌ పంట సాధారణ సాగులో 20 శాతం కూడా సాగవట్లేదు. రాష్ట్రంలో పల్లీల దిగుబడి కూడా బాగా తగ్గింది. దీంతో మద్దతు ధర కన్నా రేటు ఎక్కువ పలుకుతోంది. హోటళ్లు, స్వీట్‌ హౌజ్‌లు, బేకరీలు, టిఫిన్‌ సెంటర్లలో పామ్‌ ఆయిల్‌ను వాడుతున్నారు. 

రాష్ట్రంలో తలసరి వాడకం ఏటా 19 కేజీలు
రాష్ట్రంలో ఏటా తలసరి నూనెల వినియోగం 16 నుంచి 19 కేజీల వరకు ఉంటోంది. ప్రజల అవసరాల కోసం ప్రతి ఏడాది 6.4 లక్షల టన్నుల వంట నూనెలు అవసరమని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. కానీ మన దగ్గర ఏటా 3.4 లక్షల టన్నుల వరకే వంట నూనెలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇంకో 3 లక్షల టన్నుల ఆయిల్‌ షార్టేజ్‌ ఉంటోంది. ఈ గ్యాప్‌ను పూడ్చేందుకు సర్కారు ప్రయత్నాలు చేయకపోవడంతో విదేశాల నుంచి నూనెలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.

దిగుమతులు తగ్గినయ్‌
మన దేశానికి అవసరమయ్యే వంట నూనెల్లో 90 శాతానికి పైగా దిగుమతులతోనే సమకూర్చుకుంటున్నాం. 2020 ఫిబ్రవరిలో 10.89 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.96 లక్షల టన్నులు దిగుమతి అయింది.ఉక్రెయిన్, రష్యాల్లో పొద్దు తిరుగుడు ఉత్పత్తి భారీగా తగ్గిందని, దీంతో మనకు దిగుమతి తగ్గి కుకింగ్‌ ఆయిల్స్‌ రేట్లపై ప్రభావం పడుతోందని విజయ ఆయిల్స్‌ మేనేజర్‌ తిరుమలేశ్వర్‌రెడ్డి చెప్పారు. 

వాడకం సగానికి తగ్గించుకున్నం
నూనెల ధరలు మండుతున్నయ్‌. నెలకు నాలుగైదు నూనె ప్యాకెట్లు వాడేటోళ్లం. ఇప్పుడు సగానికి తగ్గించుకున్నం. రేషన్‌ షాపుల్లోనైనా సర్కారు ఆయిల్‌ ప్యాకెట్లను ఇప్పించాలి.
‑ సుశీల, గృహిణి, హబ్సిగూడ, హైదరాబాద్‌