మళ్ళీ పెరిగిన వంటనూనెల ధరలు

మళ్ళీ పెరిగిన వంటనూనెల ధరలు
  • రెండువారాల్లో 8% పెరిగిన ధర
  • గ్లోబల్‌ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి
  • డ్యూటీ తగ్గించినా ఫాయిదా లేదు
  • బయోడీజిల్‌ తయారీతో తగ్గిన సప్లైలు

న్యూఢిల్లీ: ప్రభుత్వం పామాయిల్‌‌ దిగుమతులపై సుంకాలను తగ్గించినా ధరలు మాత్రం తగ్గడం లేదు. ముంబైలో కేవలం ఒక వారంలో ముడి పామాయిల్‌‌ ధర 4.61 శాతం, నెలలో 9.66 శాతం పెరిగింది. ముడి సోయానూనె ధరలు కూడా 15 రోజుల్లో 10 శాతం పెరిగాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే పామాయిల్‌‌ ధరలు 72 శాతం పెరిగాయి. రెండువారాల్లో అన్ని రకాల వంటనూనెల రేట్లు ఎనిమిది శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నాయని, ఇండియా మార్కెట్లలోనూ ఇదే జరుగుతోందని బ్రోకరేజ్‌‌, కన్సల్టెన్సీ ఫర్మ్‌‌ సన్‌‌విన్‌‌ గ్రూప్‌‌ సీఈఓ సందీప్‌‌ బజోరియా చెప్పారు. బ్రెజిల్‌‌, అర్జెంటీనా, కెనడా, అమెరికాలో పొడి వాతావరణాలు ఏర్పడుతున్నాయని, వేడి ఎక్కువ అవుతోందని అన్నారు. దీనివల్ల అక్కడ పామాయిల్‌‌ తయారీ తగ్గవచ్చనే ఆందోళనలు ఉన్నాయని వివరించారు. సోయా, ఆవాల విత్తనాల ధరలు సైతం డొమెస్టిక్‌‌ మార్కెట్లో 15 రోజుల్లో ఎనిమిది శాతం పెరిగాయి. అయితే మన దగ్గర ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వంటనూనె విత్తనాల సరఫరా పెరుగుతుందని ట్రేడర్లు చెబుతున్నారు. మార్కెట్లోకి కొత్త పంట వస్తే ధరలు తగ్గుతాయని అంటున్నారు. 

చాలా కారణాలు ఉన్నాయ్‌‌...
పామాయిల్‌‌ కొనుగోలుకు సంబంధించి మలేషియా–ఇండియా మధ్య విభేదాలు రావడం,  ఇండియా సుంకాలు పెంచడం, నూనెగింజలు పండించే దేశాల్లో వాతావరణ మార్పులు వంటివి నూనెల రేట్ల పెరుగుదలకు ముఖ్యమైన కారణాలని ఇండియన్‌‌ వెజిటబుల్‌‌ ఆయిల్‌‌ ప్రాసెసింగ్‌‌ అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ సుధాకర్‌‌ దేశాయి చెప్పారు. మరో నెల వరకు ధరలు ఇలాగే ఉంటాయని చెప్పారు. ధరల పెరుగుదల నుంచి పేదలను కాపాడేందుకు పొరుగుదేశాల నుంచి వంటనూనెలను కొని తక్కువ రేట్లకు అందించాలని మోడీ సర్కారును సాల్వెంట్‌‌ ఎక్స్‌‌ట్రాక్టర్స్‌‌ అసోసియేషన్‌‌ (ఎస్‌ఈఏ) కోరింది. సౌత్‌‌ ఏషియన్‌‌ ఫ్రీ ట్రేడ్‌‌ ఏరియా (సాప్టా) ఒప్పందం ప్రకారం నేపాల్‌‌, బంగ్లాదేశ్‌‌ నుంచి నూనె దిగుమతి చేసుకుంటే సుంకాలు ఉండవని అసోసియేషన్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ డైరెక్టర్‌‌ బీవీ మెహతా చెప్పారు. ఇలా కొన్న వంటనూనెలను రేషన్‌‌ షాపుల ద్వారా అందించాలని ప్రభుత్వానికి ప్రపోజల్‌‌ పెట్టామని వివరించారు. అయితే మనదేశమంతటా వర్షాలు బాగా పడుతుండటం, ఉక్రెయిన్‌‌లో సన్‌‌ఫ్లవర్‌‌ నూనెల తయారీ భారీగా పెరిగే అవకాశాలు ఉండటం వల్ల ధరల తగ్గుదలపై ఆశలు పెట్టుకోవచ్చని అన్నారు. ‘‘వంటనూనెలతో బయోడీజిల్‌‌ తయారు చేయడం వల్ల కూడా అంతర్జాతీయ మార్కెట్లలో వీటి ధరలు పెరుగుతున్నాయి. మొత్తం 24 కోట్ల టన్నుల వంటనూనెలు తయారైతే, ఇందులో 20 శాతాన్ని బయోడీజిల్‌‌ కోసం ఉపయోగిస్తున్నారు’’ అని ఆయన వివరించారు. 2019–20 లో దేశం రూ.75 వేల కోట్ల విలువైన కుకింగ్‌‌ ఆయిల్‌‌ను దిగుమతి చేసుకుందని ఎస్‌ఈఏ పేర్కొంది