
సూపర్ స్టార్ రజనీకాంత్ , యంగ్ డెరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం 'కూలీ'. భారీ తారాగణంతో ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తమిళంలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సాధించింది. అయితే క్రమంగా థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడంతో ఓటీటీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ నిర్ణయించారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా థియేటర్ లో 25 రోజులు కూడా పూర్తి చేసుకోకుండా ఓటీటీలోకి వచ్చేసింది.
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..
ఆగస్టు 14న కూలీతో పాటు హృతిక్ రోషన్-జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' కూడా రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. బాక్సీఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. ఈ సినిమాను ఓటీటీలోకి ఆక్టోబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ రజనీకాంత్ కూలీ మాత్రం థియేటర్లలో 25 రోజులు కూడా పూర్తి చేసుకోకుండా ఓటీటీలోకి వచ్చేంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనే ప్రసారం అవుతోంది. హిందీ బాషలో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
' కూలీ' మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో నెటిజన్లు ప్రశంసులు కురిపిస్తున్నారు.
కథేంటంటే..
దేవరాజ్ అలియాస్ దేవా (రజనీకాంత్) తన గతాన్ని పక్కనే పెట్టేసి అజ్ఞాతంలో బ్రతుకుతుంటాడు. ధూమపానం, మద్యపానాన్ని నిషేధించే, కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు (రాజశేఖర్) చనిపోయాడని తెలుస్తోంది. రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఆ ఇంటికి వెళతాడు. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు ప్రీతీ (శృతిహాసన్) దేవాను అడ్డుకొంటుంది. అయితే, రాజశేఖర్ చనిపోవడానికి కారణం హర్ట్ ఎటాక్ కాదని.. మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా. అంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతీతో పాటు తన ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు. వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో.. హంతకుడిని వెలికి తీయాలని నిశ్చయించుకున్న దేవా.. విశాఖపట్నంలో ఒక స్మగ్లింగ్ ముఠాలోకి చొరబడతాడు. అక్కడ సైమన్ (నాగార్జున) చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు.అసలు సైమన్ చేసే ఆ అక్రమ వ్యాపారం ఏమిటీ? ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు? సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు? రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజమేంటీ? సైమన్ కుమారుడు అర్జున్ (కన్నా రవి), తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి, కస్టమ్స్ అధికారి ఎందుకు అవుతాడు? ఇందులో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ పాత్రలేమిటి? అన్నది మిగతా కథ.
భారీ తారాగణం..
ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, ఉపేంద్ర, సత్యరాజ్, రచితా రామ్, కాళీ వెంకట్, కన్నా రవి వంటి భారీ తారాగణం నటించింది. ఇందులో నాగార్జున విలన్‌గా నటించడం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది. రజనీకాంత్ అభిమానులతో పాటు, యాక్షన్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ విజువల్ ట్రీట్‌ను ఆస్వాదిస్తున్నారు.