కాపర్ వైర్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కాపర్ వైర్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

కోరుట్ల, వెలుగు: పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో జగిత్యాల ఎస్పీ సింధూ శర్మ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింగరాయకొండకు చెందిన పల్లిపాటి ఏసుదాసు, మెదక్ జిల్లా శాలిపేటకు చెందిన నర్రా శ్రీధర్‌ ముఠాగా ఏర్పడి జగిత్యాల జిల్లా‌తో పాటు నిజామాబాద్, సిద్ధిపేట జిల్లాల్లో చోరీలకు పాల్పడేవారు. ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్లను ఇతర ప్రాంతాల్లో పోగు చేసేవారు. ఇటీవల కోరుట్ల ప్రాంతంలో కాపర్​చోరీలు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు శుక్రవారం రాత్రి కొండాపూర్ లో ఏసుదాసు, శ్రీధర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో ఏసుదాసు, శ్రీధర్‌, కర్ణాటకకు చెందిన మరో నిందితుడు కలిసి ఏడాది నుంచి నిజమాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో కాపర్​చోరీ చేసినట్టు తెలిసింది. ఉదయం మోటర్ సైకిళ్లపై రెక్కీ చేసి రాత్రి పూట చోరీ చేసేవారని, నిందితుల నుంచి రూ.20 లక్షల విలువగల 32 వేల కేజీల కాపర్ వైర్, ఒక బైక్, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు.

ఎన్టీపీసీ వద్ద ఆరుగురు..

జ్యోతినగర్: ఎన్టీపీసీ పరిధిలో కాపర్​చోరీ చేసిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు శనివారం పెద్దపల్లి డీసీపీ రూపేశ్, గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ తెలిపారు. రాజీవ్​నగర్, లంబాడీ తండా, 8ఇన్ కాలనీకి చెందిన రాపాల శ్రీకాంత్(22), బొంత సతీశ్(20), అల్లెపు గణేశ్(27), క్యాతం ప్రకాశ్(33) పెంచికలపేటకు చెందిన గండికోట చిన్న రాజు(27), కందుల శ్రీనివాస్(45) గ్రామ శివార్లలోని ట్రాన్స్ ఫార్మర్లను పగుల కొట్టి కాపర్​తీగను ఎత్తుకెళ్లేవారు. ఇప్పటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 32 ట్రాన్స్ ఫార్మర్లను పగుల కొట్టారన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.40 వేల విలువ గల 40 కిలోల కాపర్​ను, 3 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులు 9 మంది కాగా ఆరుగురిని అరెస్టు చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు.