ఆగమైతున్న మక్క రైతులు

 ఆగమైతున్న మక్క రైతులు
  • బహిరంగ మార్కెట్​లో రేటు ఎక్కువగా ఉంటుదన్న మార్క్​ఫెడ్​
  • ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు 
  • మార్కెట్లలో రూ.1,800 మించి రేటు చెల్లిస్తలేరు

మహబూబ్​నగర్​, వెలుగు : మక్క రైతులు ఆగమైతున్నరు. మార్కెట్​లో పంటకు రేట్​ ఎక్కువ ఉందని గవర్నమెంట్​ మార్క్​ఫెడ్​ కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయలేదు. దీన్ని ఆసరా చేసుకున్న ట్రేడర్లు ఇష్టమొచ్చినట్లు మక్కలకు రేట్​ కడుతూ రైతులను ముంచుతున్నారు. ఈ వానాకాలం సీజన్​లో  జిల్లా వ్యాప్తంగా 17,917 మంది రైతులు 25,028  ఎకరాల్లో మక్క సాగు చేశారు.  ఆగస్టులో కంకి పట్టిన సమయం నుంచి సెప్టెంబరు, అక్టోబరు వరకు భారీ వర్షాలు కురవడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎకరానికి 28 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, కేవలం 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు మాత్రమే పంట చేతికొచ్చింది. వచ్చినకాడికి పంటను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్లకు తీసుకొస్తే ట్రేడర్లు తక్కువ ధరకు కొంటున్నారు.  మినిమం సపోర్ట్​ ప్రైస్​ (ఎంఎస్​పీ) రూ.1,870 కంటే మక్కల ధర క్వింటాలుకు బహిరంగ మార్కెట్లో రూ.2,300 ఉండటంతో మార్క్​ఫెడ్​ కొనుగోలు సెంటర్లను ఓపెన్​ చేయలేదు. దీంతో ట్రేడర్లు ఒక్కో రోజూ ఒక్కో రేట్​ను నిర్ణయిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. సీజన్​లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,14,123 క్వింటాళ్ల మక్కలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. 

వారం రోజులుగా రేట్​ తగ్గిస్తున్నరు

అక్టోబరు రెండో వారం నుంచి రైతులు మక్కలను ఆరబెట్టుకొని జిల్లాలోని మహబూబ్​నగర్, బాదేపల్లి, నవాబ్​పేట, దేవరకద్ర అగ్రి మార్కెట్లకు తీసుకొస్తున్నారు. మొదట్లో క్వింటాలుకు రూ.2,200, రూ.2,300 వరకు చెల్లించిన ట్రేడర్లు.. తేమ శాతం ఎక్కువగా ఉన్న వాటికి క్వింటాలుకు దాదాపు రూ.2 వేల నుంచి రూ.2,100 వరకు కట్టించారు. ఇప్పటికే వీరు సరిపడా పంటను కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న పంటను కొనేందుకు కొర్రీలు పెడుతున్నారు. వారం రోజులుగా రైతులు మార్కెట్​కు మక్కలు తెస్తున్నా, వాటిని కొనడం లేదు. రెండు, మూడు రోజుల వరకు ఎదురు చూసిన తర్వాత మక్కల నాణ్యతను ట్రేడర్లు పరిశీలిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉందని, రేట్​ తక్కువగా ఇస్తామని చెప్పి క్వింటాల్​కు రూ.1,650 నుంచి రూ.1,800 వరకు చెల్లిస్తున్నారు. దీనిపై రైతులు ప్రశ్నిస్తే ఇష్టముంటే అమ్మండి లేకుంటే తీసుకుపోండని   చెబుతున్నారు. దీంతో చేసేది లేక  ట్రేడర్లు నిర్ణయించిన ధరకే పంటను వారికి అమ్ముతున్నారు. వర్షాల వల్ల ప్రస్తుతం ఎకరాకు కేవలం 15 క్వింటాళ్ల దిగుబడే వచ్చింది. మార్కెట్లో ట్రేడర్లు ఇస్తున్న రూ.1,800 నుంచి రూ.1,900 రేటు ప్రకారం రైతులకు ఎకరాకు రూ.27 వేల నుంచి రూ.29 వేల లోపు మాత్రమే వస్తోంది. ఈ లెక్కన రైతులు జూన్​​ నుంచి అక్టోబరు వరకు కష్టపబడినా చేసిన కష్టానికి కనీసం కూలీ కూడా పడటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

కూలీలకు కూడా సాల్తలేవు

నాకున్న రెండు ఎకరాల్లో రూ.50 వేల పెట్టుబడి పెట్టి మక్కలు వేసిన. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలె. మక్కలు అమ్మేందుకు బాదేపల్లి మార్కెట్​కు తీసుకొస్తే తేమ పేరుతో క్వింటాల్​కు రూ.1,800 ధర కట్టి స్తున్నరు. పంటను అమ్మితే వచ్చిన పైసలు కూలీల ఖర్చులకు కూడా సాల్తలేవు.

- నారాయణ, రైతు మరికల్, 
తిమ్మాజిపేట మండలం

రేటు లేదంటున్నరు 

నేను మూడు ఎకరాల్లో మక్కలు వేసిన. వర్షాల వల్ల దిగుబడి తగ్గింది. గింజ మాత్రం బాగుంది. రెండు రోజుల కిందట నవాబ్​పేట మార్కెట్​కు పంటను ట్రాక్టర్​లో తీసుకొచ్చిన. తేమ ఉందని ఇంత వరకు కొంటలేరు. ఇప్పుడు రేట్​ కూడా లేదని చెబుతున్నారు. కనీసం నేను పెట్టిన పెట్టుబడి కూడా ఎల్తదా? ఎల్లదా? అని భయమేస్తోంది.

- చిన్న మల్లయ్య, నవాబ్​పేట