ట్రాన్స్ జెండర్లలో కొత్త మార్పు.. గౌరవంగా బతికే దారి వెతుక్కుంటున్నారు

V6 Velugu Posted on Jan 08, 2021

ఎక్కడైనా రైళ్లలో, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డబ్బులడుగుతూ హిజ్రాలు కనిపిస్తుంటారు. దాదాపు మనదేశంలో అన్ని సిటీల్లోనూ హిజ్రాలు అంటే ఇలాగే ఉంటారు.  కానీ వరంగల్‌‌లో మాత్రం వాళ్ల లైఫ్ స్టైల్ మారుతోంది. నిజానికి ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా వీళ్లకి మాత్రం మంచే చేసింది. ఒక కొత్త పద్ధతిలో గౌరవంగా బతికే అవకాశం ఇచ్చింది. హిజ్రాలు గౌరవంగా బతికే ఏర్పాటు చేయాలనుకున్నారు బల్దియా కమిషనర్ పమేలా సత్పతి. మామూలుగా అయితే ట్రాన్స్ జెండర్లని పనిలో పెట్టుకోవటానికి ఎవరూ ఒప్పుకోరు. వాళ్లని దూరం పెడుతుంటారు. అందుకే కమిషనర్ వాళ్లకి ఇబ్బంది ఉండని పనుల్లోనే ఉంచాలనుకున్నారు. నర్సరీలు, మెడికల్ షాపులు, టాయిలెట్‌‌ మెయింటెనెన్స్ లాంటి పనుల్లో నియమించారు. కొన్నాళ్ల కిందటిదాకా వీళ్లని అసహ్యంగా చూసిన చూపులు ఇప్పుడు మారుతున్నాయి. “మమ్మల్ని మామూలు మనుషుల్లాగే  చూడటం… మాట్లాడటం ఆనందంగా  ఉంది” అంటున్నారు వాళ్లు. మార్పు ఇలా మొదలైంది వరంగల్, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో చప్పట్లు కొడుతూ డబ్బులు తీసుకునే వందలాది హిజ్రాలు లాక్ డౌన్ వల్ల బాగా ఇబ్బందులు పడ్డారు. వాళ్ల పరిస్థితికి చలించి పోయిన బల్దియా కమిషనర్ పమేలా సత్పతి వాళ్లకోసం ఏదైనా చేయాలనుకున్నారు. వరంగల్ పరిధిలో దాదాపు 700 మంది హిజ్రాలున్నారు. వాళ్లలో కొందరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన వందలాది టాయిలెట్స్  క్లీనింగ్, మేయింటెనెన్స్ చూసేందుకు  ముందుకొచ్చారు.  అంతే కాకుండా బల్దియా పరిధిలో ఉన్న నర్సరీలని మెయింటెయిన్ చేయటానికి  ట్రైనింగ్ ఇచ్చి వాటి బాధ్యతను కొందరికి అప్పజెప్పారు. మరికొందరు ఐదు రూపాయల భోజనం స్టాల్స్‌‌లో పనిచేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా జనరిక్ మెడికల్ షాపును హిజ్రాలు నడిపేలా కమిషనర్ చొరవ తీసుకున్నారు. చప్పట్లతో అడుక్కోవటం కంటే ఇలా గౌరవంగా సంపాదించటం బాగుందన్నారు హిజ్రాలు. ఇంకా కొందరు విస్తరాకుల తయారీ లాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు నడపాలనే ఆలోచనలో ఉన్నారు.  హిజ్రాలను జనజీవనంలో కలిసేలా కమిషనర్ చర్యలు తీసుకున్నారు. మొదటి మెడికల్ షాపు కేవలం ఇలా పనులు చూపించి వదిలేయకుండా హిజ్రాలతో పొదుపు సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. ఇందులో మెంబర్ అయిన ఓరుగంటి సిరి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి, ఉద్యోగం  దొరక్క వరంగల్‌‌లోనే అడుక్కుంటోంది.  ఫార్మసీ రంగంవైపు ఇంట్రెస్ట్ ఉందని కమిషనర్ కి చెప్పడంతో వరంగల్ రైల్వే స్టేషన్ ముందు “లౌక్యం జెనరిక్ మెడికల్ షాపు”ను ఏర్పాటు ఏశారు. హిజ్రా నిర్వహించే మొట్ట మొదటి మెడికల్ షాపుగా ఇది గుర్తింపు పొందింది.  “ఒకప్పుడు చప్పట్లు కొట్టిన చేతులతో ఇప్పుడు మందులు ఇస్తుంటే  ఎంతో గౌరవంగా ఉందని” సిరి చెప్తున్నారు. :::కట్కూరి సాయివినీత్, వరంగల్ సిటీ, వెలుగు  

Latest Videos

Subscribe Now

More News