క‌రోనా డెత్స్‌ లెక్క‌ల్లో భారీ తేడాలు.. ప్ర‌భుత్వ లెక్క వెయ్యి.. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లెక్క 2 వేలు

క‌రోనా డెత్స్‌ లెక్క‌ల్లో భారీ తేడాలు.. ప్ర‌భుత్వ లెక్క వెయ్యి.. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లెక్క 2 వేలు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌మోద‌వుతున్న క‌రోనా మ‌ర‌ణాల లెక్క‌ల్లో భారీ తేడాలు క‌నిపిస్తున్నాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం చెబుతున్న దానికి, ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ వెల్ల‌డిస్తున్న లెక్క‌ల‌కు దాదాపు వెయ్యికి పైగా తేడా ఉంది. జూన్ 10 వ‌ర‌కు కేజ్రీవాల్ ప్ర‌భుత్వం అధికారికంగా వెల్ల‌డించిన బులిటెన్ ప్రకారం ఢిల్లీలో 984 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. అయితే ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు మాత్రం తాము ఇప్ప‌టికే క‌రోనాతో మ‌ర‌ణించిన‌‌‌ 2,098 మంది అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించామ‌ని చెబుతున్నారు. ద‌క్షిణ ఢిల్లీ కార్పొరేష‌న్ ప‌రిధిలో 1080, ఉత్త‌ర ఢిల్లీ కార్పొరేష‌న్ ప‌రిధిలో 976, తూర్పు ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో 42 మృత‌దేహాల‌కు ద‌హ‌న క్రియ‌లు చేసిన‌ట్లు చెప్పారు నార్త్ ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ జై ప్ర‌కాశ్.

రెండు మూడ్రోజుల్లో క్లారిటీ రావొచ్చు: కేంద్రం

ఢిల్లీలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య‌లో తేడాల‌పై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. క‌రోనా మ‌రణాల వివ‌రాల‌ను రాష్ట్రాలు ఇచ్చే డేటా ఆధారంగానే తాము రోజూ దేశ వ్యాప్త రిపోర్ట్ విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్. ఒక‌వేళ రాష్ట్రాలు క‌రోనా డెత్ ఆడిట్ చేయ‌డానికి ఒక‌టి రెండ్రోజుల సమ‌యం ప‌డితే ఆ త‌ర్వాత ఈ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం, ఢిల్లీ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ లెక్క‌ల మ‌ధ్య తేడాల‌పై రానున్న రెండు మూడ్రోజల్లోదీనిపై క్లారిటీ రావ‌చ్చ‌ని, డేటా పూర్తిగా అప్‌డేట్ అవుతుంద‌ని చెప్పారు.